అధ్యాయం – ఒకటి

‘ళాక్ష’ ఇది మా  నాగులు గాడికి పుట్టబోయే కూతురికోసం ఏర్చి కూర్చి పేర్చిన పేరు. పేరు కనుగొనప్పుడు తెలీదు ఇది మా కుటుంబంలో ఒక పేరు అవుతుందని. తెలుగు వర్ణమాల లో అంతరించిపోతున్న అక్షరాలుగా గుర్తించబడిన ‘ళ’ ‘క్ష’ తో  ఏదన్న చేద్దాం అనే ఆలోచనలో పుట్టిన పేరు ఇది. జావా క్లాసులో పాఠం వింటునట్టు నటిస్తున్నప్పుడు ,నా మది అల్లిన ఈ పేరుని వెంటనే పక్కన కూర్చున్న నా ఆప్తమిత్రుడు నాగులు గాడికి చెప్పా. ‘ఏడ్చినట్టుంది” అని ఠక్కున వచ్చింది సమాధానం. పేరు అత్యద్భుతంగా కుదిరిందని నాకు అర్థమైంది.నేను  ఏదన్న బాగా చెప్పినప్పుడో – చేసినప్పుడో , వ్యంగ్యంగా బదులు ఇవ్వటం వాడి నైజం. వాడి అంతరార్ధం నాకు అర్థమైనప్పటికీ , వాడిని పూర్తిగా ఒప్పించటానికి ఇంక కష్టపడాలి అని నా మది మళ్ళి అల్లికలో పడింది. మా జావా మేడం , మేము పొరపాట్న ఎక్కడ ప్రశ్నలు అడుగుతామో అని కంగారుతో మా వైపు అసలు చూడకుండా, బోర్డు మీద ఏదో రాస్తూ కాలం గడిపెస్తోంది. ఆవిడ అక్కడ ఎక్కించింది మా పుస్తకాల్లో ఎక్కించే పనిలో మా చేతులు ఉన్నాయ్. ‘అనంత నాగ ళాక్ష ‘ మళ్ళీ చెప్పా,ముందు ఇంకో రెండు తోకలు తగిలించి. ఈ సారి మాట రాలేదు కానీ, కనుబొమ్మలు రెండు చిట్లించి నావైపు తదేకంగా చూస్తున్నాడు.”ఏంటదీ!!!” అని అడిగాడు, జవాబు చూచాయిగా  వాడికి తెల్సినా.”నీకు పుట్టబోయే కూతురి పేరు” బదులిచ్చా. “మరి – బొంత లాగా ముందు అనంత ఎమిటీ ?!!” అడిగాడు మళ్ళీ తెలిసినా.

వాడు రెండేళ్ళ నుండి గోప్యంగా ఇష్టపడుతున్న మా సహాధ్యాయి – తేజ అనంత శ్రీనివాస మల్లీశ్వరి. ఆ పేరులోని అనంత , వీడి పేరులోని నాగ ని చేర్చి ‘అనంత నాగ ళాక్ష’గా పేర్చా. ఈ పేరులోని సంగతి వాడికి తెలిసినా, తెలీనట్టు బింకం ,విషయం బయటపడితే ఏమౌతుందో అనే భయం , ఏదేమైతేనేం పేరు బాగా కుదిరింది కదా అనే సరదా – అన్నిటిని కలగలిపి లోలోపలే మింగేసి నా జవాబు కోసం ఎదురుచూస్తున్నాడు ,ఎమన్నా చేప్తనేమో అని. దానికి తగట్టే నేను కూడా ఎం తెలీనట్టు, ఇప్పుడెం జరిగింది అనట్టు, సర్లే  ఏం లేదులే అనట్టు ఒక చూపు చూసి ఏదో శ్రధ్ధతో పాఠం వింటునట్టు నటించటం మానేసి ఏకంగా జీవించటం మొదలెట్టా. విషయాన్ని వదిలేసినట్టు వాఢూ ఏదో రాయటం కొనసాగించాడు. రెండు నిముషాలయ్యాక .. దిగాడు అసలు రంగం లోకి.

“ఆలూ లేదు చూలు లేదు,కొడుకు పేరు సోమలింగం అనట్టు ఉంది నీ బోడి పేరు.అయినా దాని పేరు నా కూతురికి పెట్టుకోవటమేంటి. ఛి!! కుక్కలు పెట్టుకుంటాయి!! అంత ఇదిగా ఉంటె పెట్టుకో నువ్వు”.   పేరు సంగతి పక్కన పెట్టి , వీడు ఎన్ని రకాలుగా సంకేంతాలు పంపినా  ,వాళ్ళ మౌన ప్రణయ గాధ అంగుళం కూడా ముందుకి జరగట్లేదని, దానికి ఏదో నేను కారణం అయినట్టు నా మీద కసిరాడు. అవును, వాడికి కోపం వచ్చినప్పుడు వాడి ఉద్దేశంలో అన్నిటికి కారణం నేనే . అందులొనూ ఈ సంగాతిలో మరీనూ !! చక్కగా బుద్ధిగా చదువుకుంటున్న వాడిని ఈ ఆలోచనల దిశగా ప్రోత్సహించింది నేనే అని వాడి అభిప్రాయం. ఒక రకంగా అది నిజమే .. సినిమాల్లో హీరో పక్కన్న చమ్చా స్నేహితులు హీరోయిన్ హీరో ని చూస్తోందని, హీరోని ప్రేమిస్తోందని హీరోని ప్రేరేపించినట్టు .. మొదట్లో నేను కూడా వాడిని అలాగే ఎగేసా. నాగులు గాడు మా క్లాసులో బెస్ట్ స్టూడెంట్. వాడి దగ్గర్నుంచి నోట్స్ లు గట్రా తీస్కోటానికి, పెన్నులు, పేజీలు అరువు అడగటానికి వీడిని మాటిమాటికి కదిలిస్తూ ఉండేది మల్లీశ్వరి. అది  మా క్లాసులో గానంలో గండు కోకిల.  దానికి తగ్గట్టే మావాడికి భీభత్స భయంకరమైన శాస్త్రీయ సంగీతాభిరుచి ఉంది. వాడి రుచి వాడికి పస పక్కవాల్లకి నస. ఇంక వీడి సంగీత కళాభిమానాన్ని అడ్డం పెట్టుకుని, అడిగేది- వెంటపడేది అదే అయినా, అజమాయషీ చలాయించి మరీ జరిపించుకునేది పనులన్నీ. అందుకే మల్లీశ్వరి అంటే నాకు ఒకరకంగా గిట్టదు. నాకూ దానికీ  పైకి కనపడని వైరం ఉంది.ఎందువలనో నేనూ దానికి   గిట్టను. ఆ కారణం ఏంటో తెలిసినా  నాగులు గాడు నాకు చెప్పడు, తెలియకపోయినా – తెలిసి చెప్పనట్టు తెలిసిపోయేలా నటిస్తాడు.

“ఉరుము ఉరుమి మంగలం మీద పడ్డట్టు మధ్యలో నన్ను అంటావేంటి” బదులిచ్చా. టాపిక్ పూర్తిగా నా మీదకి తిరిగితే కష్టం,నాకు ఈ రోజు వీడి చేతిలో మొట్టికాయలు తప్పవని గ్రహించి తిరిగి  దాని మీదకే తిప్పా .” అన్నీ తెలిసి కూడా ఎం తెలీనట్టు అది ప్రవర్తిస్తుంటే, నన్ను దెప్పుతావే పక్కన కూర్చొని. ఈ గాంభీర్యం అక్కడ ప్రదర్శించు” అని జోడించా.

“తెలిసి అది నాటకాలాడుతుంటే నేను మాత్రం ఎం చెయ్యను? ” వాడి ఆవేశం ఆక్రోశంగా మారిపోతోంది.

భాష పూర్తిగా మారకముందే బదులిచ్చా ” అయితే మనేయ్య్. ఇప్పుడు ఎవడు చెయ్యమన్నాడు “.

“నీదెం పోయింది. పక్కన కూర్చొని బానే చెప్తావ్ సొల్లు కబుర్లు.అయినా నిన్ను అనాలి”.

అమ్మో !! మళ్ళి నా మీదకి తిరుగుతోంది .ఈ సారి తెలివిగా బదులివ్వాలి. ” అందుకే .నీ విలువ దానికి తెలిసొచ్చేలా ప్రవర్తించు నువ్వు కూడా. అడిగిన వెంటనే చెయ్యకు. అది మంచిగా ఉన్నప్పుడే నువ్వు కూడా మంచిగా ఉండు” అని ఒక క్కోక్కిరాయి సలహా విసిరా.

ఆలోచనలో పడ్డాడు. అది జరగని పని అని వాడికి కూడా తెలుసు. ఎదైతేనేం పిచ్చో ఎచ్చో నా  మాటకి ఆక్రోశం నుంచి మళ్ళి ఆలోచనలోకి దిగాడు. తలకాయ్ గోక్కున్నాడు . పుస్తకంలోని పేజీలు ముక్కల ముక్కలాగా చింపి తినేస్తున్నాడు. కోపంగా తల పూర్తిగా వెనక్కి తిప్పి అది చూడకపోయినా మల్లీశ్వరీని ఒక చూపు చూసాడు. అంతలో ఈ తంతునంతా గ్రహించిన మా వెనక బెంచి శేఖర్ గాడు నన్ను తిట్టాడు. ” ఎందుకురా వాడిని ఊరికినే కెలుకుతావ్ ? నీకు తోచకపోతే నువ్వు కూడా ముక్కలు చించి పేజీలు తిను !! “.

“నువ్వు మూస్కో !! నిన్నెవడు అడిగాడు ?” అని కళ్ళు పెద్దవి చేసి అరనవ్వుతో హెచ్చరించా వాడిని. టాపిక్ నా మీదకి మళ్ళి తిరగకూడదు అనే తొందరలో , నా మాట బిగ్గరగా వచ్చింది. మాట్లాడింది నాగులు గాడు అనుకుని , సమాధానం తెలియని ప్రశ్న అడగటానికి లేపింది నాగులు ని మా జావా మేడం .  అసలే కోపంగా ఉన్న వాడికి ఇది పుండు మీద కారం. మళ్ళీ టాపిక్ తిరిగి తిరిగి నా మీదకే తిరగటం నాకు దెబ్బ మీద రోకటిపోటులా మారింది.

“నాగ్ … ముందు బెంచిలోనే కూర్చొని కూడా ఎందుకు మాట్లాడుతున్నావ్ ? స్కోప్ ఆపరేటర్ అంటే ఏంటి జావా లో చెప్పు ” అని సంధించింది . మూస్కో అన్న నా మాట విన్న ఆవిడకి   ,దానికి ప్రాసగా గుర్తొచ్చిన ప్రశ్న అదే మరి . కోపంలోనో ,కంగారులోనో ఉంటె నాగులు గాడు దేనికీ బదులు చెప్పడు ,ఉట్టి కసిరే చూపులు తప్ప.  ఇప్పుడు వాడు కోపంలో ఉన్నాడో, కంగారులో ఉన్నాడో తెలీదు కాని, జవాబు అయితే వాడికి తెలిసినా  చెప్పలేదు. చెప్పలేదు సరి కదా పుస్తకంలో పేజీని ఇంకా  వేగంగా చర్రున చించాడు ,ముక్కలు ముక్కలుగా  నమిలేయ్యటానికి. నాగులు గాడే చెప్పలేదంటే ఇంక ఎవరూ చెప్పరు అని గ్రహించేసింది మా మేడం. సందర్భాన్ని సద్వినియోగం చేస్కుందాం అని – చెప్పే పాఠం ఆపేసి ,ఇటు పక్క కూర్చున్న నన్ను లేపకుండా అటు పక్క కూర్చున్న ఇంకోడిని లేపి అదే ప్రశ్న అడిగింది. జవాబు లేదు. ఇంక అక్కడితో మొదలు , ఒక్కొక్కళ్ళని లేపటం – అదే ప్రశ్న అడగటం – జవాబు లేకపోవటం-చెప్పలేదని  నున్చోబెట్టటం. మధ్యలో కొంతమందికి జవాబు తెలిసినా , నాగులు గాడు ఎందుకు చెప్పలేదో.. బాగా క్లిష్టమైన ప్రశ్నేమో  అని ఆలోచించుకుని ..ఎందుకులే  చెప్పటం అని చెప్పకుండా నున్చున్డిపోయారు. ఈ రకంగా క్లాసు లో ఇటు పక్కన ఉన్న నేను తప్ప అటు పక్కన ఉన్న అందరూ నున్చోటానికి అరగంట పైనే పట్టింది.

” హ్మ్మ్ !!! నీ వల్ల ,అందరూ నుంచున్నారు కదరా !! ” మళ్ళి కూశాడు వెనక బెంచి శేఖర్.

“ఎవడు నున్చోమన్నాడు?? జవాబు తెలిస్తే చెప్పి కూర్చో!! ” బదులిచ్చా. పక్కనుంచి పెజీ మళ్ళీ చిరిగింది చర్రున.

సశేషం …..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s