అధ్యాయం – రెండు

“ఏదైతేనేం ముందు ఇక్కడినుంచి తప్పించుకోవాలి”. అనుకున్నానో లేదో – క్లాసు టైం అయిపోయిందని, ఇంక చెప్పటానికి అడగటానికి ఇంకేం దొరక్క ఐదు నిముషాల ముందే వెళ్ళిపోయింది మా మేడం.  నుంచున్న వాళ్ళల్లో సగం మందికి పైగా హుటాహుటిన బయటకి తరిలారు. మాకున్న పావుగంట బ్రేక్ టైం లో  పావు మైలు నడిచి వెళ్లి – టోకెన్ కోసం ఎగబడి -టిఫిన్ తీస్కోటానికి కూలబడి – నాలుగు ముద్దలు మింగి మళ్ళి తిరిగి రావటానికి ఆ మాత్రం ఆత్రుత చూపిస్తే గాని కుదర్దు. పైగా అసలే తర్వాత క్లాసు ఆ కోపిస్ట్ సంతానం గాడిది.  అందరితో పాటే నేను  కూడా హడావుడిగా బయటకి జారుకున్న. తరగతి గది నుంచి ఒక పది అడుగులు అవతలికెళ్ళి  మా గుంపు కోసం ఎదురు చూస్తున్నా . “హను  !!”. నాకు వినపడినా కావాలని చూడలేదు , పలకలేదు. “హనూ !!!” మళ్ళి వినపడింది బిగ్గరగా ,దగ్గరగా. ఈ సారి తప్పలేదు, తిరిగి చూసా. “వెళ్దామా?” అని అడిగింది వంద్య. ఏం మాట్లాడకుండా అలా చూస్తూ నుంచున్నా. నా బుర్ర నిండా ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి. “నాగులు గాడికి కోపం తగ్గిందో లేదో  – పావు గంటలో తిని రావాలి- బాబోయ్ ,తర్వాత ఆ కోపిస్ట్ క్లాసు – అసలు హనూ ఏంటి !!” . నా పూర్తి పేరు హను ఆశ్రిత్ , అందరూ ఆశ్రిత్ అంటారు. వంద్య ఒకత్తే హనూ అని పిలుస్తుంది. ఎందుకో తెలీదు , అడిగినా సరైన జవాబు ఉండదు , అసలు ముందు నేనూ అడగలేదు. అందరకీ విరుధంగా వంద్య నన్ను హనూ అని పిలవటం నాకు ఇష్టం లేదు, కాని పలుకుతాను. బహుశా హనూ అని పిలవబడటం కన్నా అందరూ గుర్తించేలా తను నన్ను ప్రత్యేకంగా పిలవడం మరీ ఇష్టం లేదేమో !!. నా జవాబు లేకపోయేసరికి –   “సరే అయితే, నాకు తోడు రా ..నాకు ఆకలేస్తోంది” అని పురమాయించింది. యథాలాపంగా అటూ ఇటూ చూసి నా అడుగులు వంద్య వెనకాల సాగాయి.

కొంచం దూరం నడిచాక వంధ్య మాటల పరంపర మొదలైంది.  “ఏంటి మీ శేషు ఏం సమాధానం చెప్పలేదు, మరి ఎప్పుడు చూసినా ఏదో చదువుతునట్టే కనపడతాడు.” నాగ శేషు అయిన మా నాగులు గాడంటే వంద్యకి ఒకింత చులకన, మల్లీశ్వరి అంటే మరీనూ. అందుకే సందర్భం కుదిరిన ప్రతీ సారి వాళ్ళిద్దరినీ  మాటలతో పొడవక మానదు. “నువ్వూ చెప్పలేకపోయావుగా జవాబు” అని ఎదురు సంధించా. ఎందుకు ఇప్పుడు మళ్ళీ దాని మీద మాకు  వాదులాట అని మళ్ళి నేనే  వెంటనే అడిగా తప్పించటానికి  “ఇప్పుడెం తినాలి వెళ్ళీ?” అని.

“ఈ రోజు బజ్జి తిందాం అనుకుంటున్నా, ఏమంటావ్? నూనె పదార్థాలు తినొద్దని మా అమ్మ రోజూ ఒకటే పోరు. రోజు ఏదో మాములు తిండే ఉంటోంది ఇంట్లో. అందుకే ఈ రోజు కావాలని టిఫిన్ తినకుండా హడావుడిగా బస్సు టైం అయిందని ముందే బయటకి వచ్చేసా . నువ్వేం తిన్నావ్ పొద్దున్న?” . బజ్జీ అని చెప్తే సరిపోయే చిన్న ప్రశ్నకి ఎప్పటిలానే ఇంత బారున బదులు చెప్పింది , అడిగిన ప్రశ్న మర్చిపోయే విధంగా. నా సమాధానం తో ప్రమేయం లేకుండా – “నువ్వు కూడా బజ్జీ తిను” అని  సిఫార్సు చేసింది. నిజంగానే బజ్జి తిందామని అనాలోచితంగా ముందే అనిపించిన నాకు, ఇప్పుడు కావాలని వేరేది తినాలనిపిస్తోంది. “లేదులే నువ్వు వేరేది తీస్కో, నేను  ఎలాగో బజ్జి తీస్కుంటున్నాగా” అని మళ్ళీ తనే సవరించింది.

“కావాలంటే నువ్వు తీస్కో. నేను  బజ్జినే తీస్కుంటా” అని అకారణంగా తనకి వ్యతిరేకించా ఎప్పటిలానే.

“అవును,నేనే చెప్దామనుకున్నా మళ్ళీ అదే ” అని మళ్ళీ సవరించింది. ఈ సారి నాకు చెప్పటానికి ఇంకేం లేదు. పొడవైన కాళ్ళ వలన నా  అడుగులు పెద్దగా వేగంగా పడుతున్నాయ్ , అయినా వంద్య దాని గురించి ఫిర్యాదు చెయ్యకుండా నన్ను అందుకోవటానికి  నా పక్కన అటూ ఇటుగా పరిగెడుతోంది. అది నేను గమనించినా నా అడుగుల్లో మార్పులేదు. సన్నగా చక్కగా అందాజుగా పొడుగ్గా ఉండే వంద్యది ,చూపరుల్ని ఆకట్టుకొనే కళ గల మొమె. నాకన్నా ముందే తనే నా మీద ఒకింత శ్రద్ధ చూపిస్తోందనే కారణం చేతేమో నాలోని గర్వం/అహం పాళ్ళు ఎక్కువవుతున్నాయి వంద్య విషయంలో. గమ్యం చేరుకోగానే నా స్నేహితుల గుంపుని చూసి  వాళ్ళతో తింటా అని వెళ్ళిపోయా, వంద్య జవాబు కోసం ఎదురుచూడకుండానే. మొహం చిన్న బుచ్చుకుని తినకుండానే వెనుతిరిగింది. ఇప్పుడు నా మీద కోపంగా ఉన్న వాళ్ళ సంఖ్య రెండుకి చేరిందని నా బుద్ధి గ్రహించింది.

Advertisements

One thought on “అధ్యాయం – రెండు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s