అధ్యాయం నాలుగు

ఏదైతేనేం శేషుగాడికి నా మీద కోపం పోయింది. ఇక మిగిలింది వంద్యే ప్రస్తుతానికి. వంద్య కోపం పోగొట్టటానికి మార్గం – నేను నా అంతట తనని పలకరించి మాట్లాడటమే. మధ్యానం భోజనానికి వంద్య తొ వెళ్దాం అని నిర్ణయించుకొని వంద్య వైపు వెళ్ళా అడగటానికి, అంతలో తనదగ్గరికి వస్తున్న నన్ను చూసి మొహాన్ని విరుసుగా  తిప్పుతూ జడని కొరడాల ఝుళిపించి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశాన్ని ఎవరూ చూడలేదు కదా అని నిర్ధారించుకోవటానికి వెనక్కి తిరిగి చూసా. హతోస్మి !! మమ్మల్నే చూస్తున్న అందరూ చూడనట్టు ఒక్కసారిగా మొహం తిప్పుకున్నారు.శేఖర్ గాడు మాత్రం నన్నే చూస్తూ కనుసైగ చేసాడు – “ఎందుకు లేటు ! కానీయ్ “ అని. నిండా మునిగాక ఇక చలెందుకని నేనూ సాగాను వంద్య వెనుకాల. నేను తన వెనుకే వస్తున్నానని నిర్థారించుకుని, నా కనుచూపుకు అందకుండా చటుక్కున పలకరిస్తూ దూరిపోయింది – తనకి పెద్దగా పరిచయం లేని ఎవరి గుంపులోనో. చేసేదేం లేక నా దారిన నేనూ సాగాను.  పట్టించుకోకుండా వెళ్ళిపోయినా, వంద్య ఆసాంతం నన్ను గమనిస్తుందనే తెలిసి ,మొహం కావాలని దిగాలున వేలాడేసుకునే ఉన్నా భోంచేసి తిరిగి క్లాసుకి చేరేవరకు.

సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సుల దగ్గర మాట్లాడదాం అనుకున్నా . కాలేజి అయ్యాక అందరూ కాలేజి బస్సులు బయలుదేరేవరకు గేటు దగ్గర చేరతారు. వంద్య అందకుండా ముందే వెళ్ళి మళ్ళీ ఏదో గుంపులో చేరిపోయింది. నేను కూడా బస్సెక్కి కూర్చున్నా ఖాళిగా. ఇంతలో వచ్చాడు విష్ణు. వీడొకడు.. నాకు అర్థం కాడు ఎప్పుడూ ..వ్యతిరేక వ్యవహారశైలి వాడి నైజం. ఏదన్నా సంతోషకరమైన వార్తో ,ముఖ్యమైనదో చెప్పినప్పుడు పేలవంగా చూసి ఊరుకుంటాడు , మనం ఊహించనిదానికి ఎగిరి గంతేసి అంటిపెట్టుకుని ఉంటాడు. ఈ నైజం  వంటపట్టటానికి నాకు చాల కాలమే పట్టింది, ఏదైతేనేం నాకు అర్థంకాని  నా ఆప్తహితుడు వీడు. వస్తూనే వాడి కబుర్ల జడి వాన మొదలైంది.యథాలాపంగా వింటూ, పొద్దున్న జరిగిన మైదానం గాడి హడావుడి ,వంద్య విషయం చెప్దామా అని ఊగిసలాడాను. తీరా చెప్పాక ,వాడు నేను ఊహించినట్టు స్పందించకపోతే నాకు తిక్కరేగుతుందని నా బుద్ధి హెచ్చరించటంతో ,వాడినే మాట్లడనివ్వసాగాను.రొజూ పావుగంటలో బయల్దేరాల్సిన బస్సులు అరగంట అవుతున్నా కదలడం లేదు ఈ రోజు. బస్ పాసులు చెక్ చేయటానికి ఈ తాత్సారం అని అర్థమైంది అందరికీ. రోజు ఎక్కే మొహాలే అయినా, డబ్బులు కట్టి పాస్ తీస్కున్నాం అని తెలిసినా సరే, రొజూ ఆ బస్సు పాస్ తీసుకురావాలని ,అది లేకపోతే పొరపాటున కూడా ఎక్కనివ్వకూడదని మా కాలేజిలో ఒక బోడి రూల్. పని పాట లేని పనికిరాని లెక్చరర్లకి పని చెప్పటానికి ఈ పనికిమాలిన రూల్. వారు కూడా విద్యార్ధుల్ని తిట్టి ,హుకుం చలాయించి  తమ  పరపతిని పెంచుకోవటానికి అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో భాగంగా  మా  బస్ లోని ఒక పది మందిని దింపెసారు. పాస్ మర్చిపోయిన కారణాన వారిని హడాలగొట్టి,వారి ఐడి కార్డు లాక్కొని మరుసటి రోజు ఫైన్ వసూలు చేస్తారు. ఇలా అనవసరమైన చేష్టలతో పొద్దునుంచి విసిగిపోయి, నలిగిపోయిన విద్యార్థుల్ని ఇంకా నసపెట్టటానికి ఎవర్నీ బయటకి కదలనీయకుండా అన్నీ బస్సుల్ని ఆపేసారు. నెమ్మదిగా చూస్తూ చూస్తూనే సమయం ఆరు అయిపొయింది. నీరసంతో పాటు అసహనం పాళ్ళు పెరుగుతున్నా ,తొక్కివేతకు అలవాటు పడిపోయే సగటు భారతీయ  స్వభావం ఎవరి గొంతుని పెగలనీయలేదు. చెకింగ్ అయిపోయినా మా బస్సు కదలటం లేదు. ఎక్కడినుంచో దూరంగా వినపడుతున్న సన్నటి అరుపులకి,అలికిడికి కిటికీ లోంచి తొంగి చూసాను. ఒక నాలుగు బస్సుల అవతల దాదాపుగా ఒక నలుగురు లెక్చరర్లు ఏదో వాదనలో ఉన్నారు. ఆ బస్సు డ్రైవర్ ,క్లీనర్ పక్కన చెట్టు కింద కూర్చొని పుల్లలు నములుతున్నారు. ఆ గొడవేంటో అని ఆత్రంగా చూస్తున్న మాకు మా బస్సు క్లీనర్ ద్వారా వర్తమానం అందింది. లబ్బీపేట వెళ్ళాల్సిన ఏడో నంబరు బస్సులో ఎవరో పిల్ల పాస్ మర్చిపోయింది సరికదా, బస్సు దిగను ఏం చేస్కుంటారో చేస్కోండి అని మొండికేసిందిట. ఇది విన్న వెంటనే నాకు ఠక్కున అర్థమైపోయింది .. ఆ పిల్ల వంద్యే అని. ఇలాంటి పనికిమాలిన రూల్స్ ని లెక్కచేయకుండా,ఎవరికీ జడవని,ఎవరినైనా  ఎదురించే మొండి ధైర్యం వంద్య సొంతం ..పైగా అందులో ఈ రోజు చిరాకులో కూడా ఉంది. వయసులో ఉన్న ఆడపిల్ల మీద కఠినమైన చర్య తీసుకోలేక, అలా అని వదిలి పెట్టా లేక తమదైన శైలిలో ఏదో ఒకటి చెయాలని పిచ్చి ప్రయత్నంలో ఉన్నారు ఆ లెక్చరర్స్ . ఇక ఈ రోజుకి కదిలినట్టే అని అనుకున్నా , నేను అనుకున్నదే విష్ణు మొహంలో కనపడింది. వాడికీ అర్థమయ్యింది ఆ పిల్ల వంద్యే అని. నాకోసం అని పైకి ఏం అనకుండా తెలీనట్టు నా వైపు అసహనంగా చూసాడు,అదేదో ఇదంతా నా వల్ల అయినట్టు. ఎమన్నా మాట్లాడి ఈ విషయంపై  నేను తెర లేపినవాడినవ్వటం ఎందుకని ; ఏం అర్థంకానట్టు మళ్ళి తల కిటికీలోంచి బయటకి పెట్టా.

ఇంతలో వేరే అరుపులు వినపడ్డాయి ముందు వైపునుంచి. కిటికీలలోని తలలన్నీ ఎడమ వైపునుంచి కుడివైపుకు తిరిగాయి. ముందు ఉన్న రెండో నంబరు బస్సుదగ్గర పెద్ద అలజడి. కదలని బస్సులో ఎందుకని కూర్చోవాలి ఎంతసేపని కూర్చోవాలని ఝాన్సీ గొడవకి దిగి, క్లీనర్ ని కొట్టినంత పని చేసి కిందకి దిగిపోయింది. వెనకాలే ఆ బస్సులోని వారంతా దిగారు. ఆ వెనకాలే మిగితా బస్సులోని వారంతా కూడా దిగిపోయారు. పరిస్థితి ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసేదాకా వెళ్ళింది. ఫోన్లో ఏం చెప్పాడో కాని మా పొట్టి ప్రిన్సిపాల్, ఉన్న పాతిక బస్సుల ఇంజిన్లు ఒక్కసారిగా ప్రాణం అందుకున్నాయి. అందరూ హుటాహుటిన తిరగి ఎవరి బస్సు వారు ఎక్కారు. విష్ణు మరో మాట మాట్లాడలేదు నాతో. వంద్య మీద వాడికున్న అసహనాన్ని నా దగ్గర వెళ్లగక్కే ఆస్కారం నేను వాడికి ఇవ్వలేదని నా మీద వాడికి అలక వచ్చిందని నాకు అర్థమయ్యింది. ఈ రోజుకి జరిగిన తంతులు చాల్లే అని నేనూ ఊరుకున్న,మరుసటి రోజు చూస్కోవచ్చులే అని. ఇంటికి చేరేసరికి ఏడు అయ్యింది. గేటు తీస్తున్న నన్ను చూసి, వంటిట్లో కూర్చున్న మా అమ్మమ్మ పెరట్లో ఉన్న మా అమ్మకి కేకేసింది .. “వాడొచ్చాడే అమ్మడు”.

“ఏం నాన్నా , ఇంత లేటయ్యిందే ?” అని వివరం అడుగుతూ మా అమ్మ వసారలోకి వచ్చింది నా బ్యాగ్ అందుకోటానికి. అడుగులో అడుగు వేసుకుంటూ మా అమ్మమ్మా వచ్చింది వెనకాలే.
నేను మా అమ్మకి జవాబు చెప్పెలోపలె ,మళ్ళీ అడిగింది మా అమ్మమ్మ “ఏం నాన్నా, ఎందుకు లేటయ్యింది? ముందు తింటానికి ఎమన్నా పెట్టవే, పిల్లాడు ఆకలిమీద ఉండుంటాడు” . అప్పటికే మా అమ్మ నాకోసం ఏదో చేసే పనిలో పడింది. “ఏం లేదు అమ్మమ్మా, ఎప్పుడూ ఉండే సోదే” అని చెప్తూ గదిలోకి వెళ్తున్న నేను, ఫోన్ శబ్దం విని వెనక్కి తిరిగా.

హ్మ్ !! మొదలూ !!! వేళా పాళ ఉండదు వీళ్ళిద్దరికీ.. నువ్వెళ్ళి మొహం కడుక్కుని తిను ముందు. నేను చూస్తలే ఫోన్” అని నా మీద అరిచింది అమ్మమ్మ.

“అబ్బా, పర్లేదులే” అని అంటూ నేను వెళ్ళి ఫోన్ ఎత్తే లోపలే అక్కడే ఉన్న మా అమ్మమ్మ ఫోన్ ఎత్తింది.

“హలో ! నాగ శేషా ? ఏం నాన్నా బాగున్నావా, వచ్చేసావా కాలేజి నుంచి అప్పుడే ? ఇదిగో వీడు ఇప్పుడే వస్తున్నాడు” అని చెప్తూ ,ఫోన్ నాకు అందించింది మొహం చిట్లిస్తూ. “ఇప్పుడే వచ్చారుగా,అప్పుడే ఏముంటాయి?! తిండి కూడా తినకుండా”  అని మా ఇద్దర్నీ కలిపి అంటూ వెళ్ళింది. నాకూ శేషుకు ఇదో అలవాటు. కాలేజిలో ఏదన్నా హడావుడి జరిగినప్పుడు, ఇంటికి రాగానే నాకు ఫోన్ చేస్తాడు. మా కాలేజిలో రొజూ ఏదో ఒక హడావుడి జరుగుతూనే ఉంటుంది. రెండు నిముషాలు మాట్లాడి పెట్టేసా. బట్టలు మార్చుకొని మళ్ళి తిరిగొచ్చి ఫోన్ వైపు వెళ్ళాను.
“ఇప్పుడేగా అయ్యింది.మళ్ళి ఎవరికీ ??” అని అడ్డుకుంటూ మా అమ్మ చేతిలోంచి పళ్ళెం తీస్కుని నా చేతిలో పెట్టింది అమ్మమ్మ. “ముందు తిను  ఇప్పటికైనా”. అమ్మ కూడా వచ్చి నా పక్కన చేరింది, నా  కబుర్లు వినటానికి.

Advertisements

2 thoughts on “అధ్యాయం నాలుగు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s