అధ్యాయం – ఐదు

ఫలహారం అందుకుని వసారాలోకి చేరా. నా పక్కనే అమ్మ, అమ్మమ్మా కూడా వచ్చి కూర్చున్నారు. అమ్మ చేసిన గవ్వలు తింటూ పొద్దున క్లాస్ లో జరిగిన సరదా విషయాలు, సాయంత్రం బస్ దగ్గర గొడవ కబుర్లతో కాలక్షేపం చేసాం కొంత సేపు. ఇంతలో తను  చూసే ధారావాహిక టైం అయ్యిందని అమ్మమ్మ ముందర గదిలోకి వెళ్ళింది టీవీ పెట్టుకోటానికి.

“పద, మనం కూడా ఇక లోపలికి వెళదాం, దోమలోచ్చే టైం అయ్యింది” అని అన్న అమ్మ మాటకి నేనూ కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నా. అమ్మ మళ్ళి వంట పనిలో పడింది. ధారావాహిక మొదలయ్యి పేర్లు పడుతున్నాయి. టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకుని ,ఏదో పరీక్షకి సమాయుత్తం అవుతున్నదానిలాగా శ్రద్దగా అందులో నిమగ్నమైపోయింది అమ్మమ్మ.

అటూ ఇటూ దిక్కులు చూస్తూ  “అక్కా, నాన్నా ఎప్పుడోస్తారామ్మా?” అని గట్టిగా అడిగాను ,వంటింట్లో ఉన్న అమ్మకేసి.

“వస్తారులే ,ఇహనో ఇపుడో ” అని ఇంకో ప్రశ్నకి తావు ఇవ్వకుండా  ఠపీ మని జవాబు చెప్పింది అమ్మమ్మ, .టీవీ చూసే టైంలో ఎవ్వరినీ మాట్లాడనివ్వదు. నేను కూడా ఒక రెండు నిముషాల పాటు ధారావాహిక చూసాను, ఏం నడుస్తోందని.అందులో  ముగ్గురు ఆడవాళ్ళు అరుచుకుంటున్నారు, వెనకాల ఇద్దరు ఏడుస్తున్నారు, ఒకరు బిత్తరపోయి చూస్తున్నారు,ఇంకోరు తగాదలోకి దూరటానికి సిద్దంగా ఉన్నారు, మగవాళ్ళు మాత్రం  ఏమి చేయలేకపోతున్నాం అనే రీతిలో ముఖకవళికలు పెట్టి నీళ్ళు నములుతున్నారు.  ఉమ్మడి కుటుంబంలో ఎవరితో ఎవరికీ పడట్లేదు, అని అందులోని సారాంశం నాకు చూచాయిగా అర్థమయ్యింది. టీవీ లో అందరికన్నా పెద్దగా అరుస్తున్న అమ్మాయిని చూసి  “ఎవరది?!” అని అడిగా .

“అదే పుష్పం, దాని తోడికోడలు మరువం. ఆ కూర్చొని ఏడ్చేది రాజకి …” అని మొదలుపెట్టి, అలాంటి  అర్థం పర్థం లేని పేర్లతో నిండిపోయిన ఆ సీన్ లోని పాత్రలగురించి వివరిస్తూ , వారి నటనని వర్ణిస్తూ ఆ ధారావాహిక కథ అప్పచేప్పేస్తోంది అమ్మమ్మ. పుష్పం, మరువం, సీతిక, రాజాకి … ఇలాంటి అర్థరహితమైన పేర్లు తప్పించి నాకేమి ఎక్కట్లేదు, ముందు అసలు నేనూ వినట్లేదు. నేను ఏదో మాములుగా అడిగానని గుర్తించకుండా, కనీసం నేను వినట్లేదని కూడా గమనించకుండా టీవీ వైపే చూస్తూ, టీవీ సౌండ్ కన్నా పెద్దగా అరుస్తూ కథ చెప్తూనే ఉంది. ఒక ఐదు నిముషాల పాటు ఆ కథని క్లుప్తంగా చెప్పి , ఆ కథ లోని ఏదో లోసుగుని లాగుతూ జనాంతికంగా ప్రశ్నించింది “బుర్రతక్కువ వెధవ, వాళ్ళందరూ  చివరికి ఎలా కలుస్తారు? !! ” అని .  ఒక్క నిముషం కంగారు పడ్డా, ఇప్పటిదాకా చెప్పిన దానిలో నాకేమన్న క్విజ్ పెడుతోందా ఏంటి! అనవసరంగా ఏం జరుగుతోందని అడిగాను అని బిత్తరపోయి బుర్ర గోకున్నా.

“ఆహా, అసలు నాకు అర్థం కాదు, ఇలా అయితే వాళ్ళు కలుస్తారని ఎలా అనుకుంటున్నాడు వాడు ?” అని మళ్ళి అడిగింది,ఈ సారి నా వైపు తిరిగి చూస్తూ. ఆ ధారావాహిక కథా రచయితని తిడుతోందని అర్థమయ్యింది మొత్తానికి.

“కలవరేమో” అని వెటకారంగా చెప్పా. నేను కూడా ఆ రచయితని తిడుతునట్టు.

“అదే, ఏమిటో వాడి బొంద !! పిచ్చి గోల, పిచ్చి సీరియల్ ” అని ఫెళ్ళున నవ్వింది. నాకు కూడా మా అమ్మమ్మ నవ్వుకి బాగా నవ్వొచ్చింది.

“మరెందుకు చూడటం” అని సంధించా.

“ఎందుకు బాలేదో చూడొద్దా!” అని నవ్వు ఆపి చెప్పి, మళ్ళి నవ్వింది.

ఇంతలో అమ్మ వచ్చింది “ఆశ్రూ , అక్క ఇంక రాలేదేం ?  రోజు ఈ పాటికి వచ్చేయాలి , అలా బస్ స్టాప్ దాక తోడు వెళ్ళిరా ,వస్తుందేమో”. అమ్మ గొంతులోని ఆత్రుతని గుర్తించి, ధ్యాస టీవీ మీదనుంచి మా సంభాషణ మీదకి తిప్పింది అమ్మమ్మ.

“వస్తుందిలేమ్మ అక్క, ఇంకో పది నిముషాలు చూసి వెళ్తా” అని జాబు చెప్పా.

నా జవాబు రుచించక అన్యమనస్కంగానే వెనుదిరిగింది. “అమ్మా, సౌండ్ తగ్గించవే !! బా గోలగా ఉంది” అని నా మీద ఉన్న చిరుకోపాన్ని మా అమ్మమ్మ మీద ప్రదర్శించింది. ఠక్కున సౌండ్ ని పూర్తిగా తగ్గించేసింది అమ్మమ్మ. అక్క ఇంకా  ఇంటికి చేరలేదనే ఆలోచనలో పడి, ఆ సౌండ్ లేని ధారవాహికనే నిశితంగా చూస్తూ పరధ్యానంగా కూర్చుండిపోయింది. నా ఆలోచన కూడా అక్కమీదే ఉంది.

“లే , ఒకసారి వెళ్ళిరా నాన్నా సందు మూల దాకా , అక్క వస్తుందేమో” అని టీవీ వైపు చూస్తూనే నన్ను తడిమింది అమ్మమ్మ.

కళ్ళ ముందే నాలుగు బస్సులు వచ్చి వెళ్ళిపోయాయి.అక్క జాడ మాత్రం లేదు. అప్పటిదాకా లేని కంగారు మొదలైంది నాకు. ఇంకొంచం ముందుకెళ్ళి చూద్దాం అని ఇంకో రెండు సందులు ముందుకెళ్ళాను. అక్కడ మిరపకాయి బజ్జిల బండి దగ్గర నుంచొని దిక్కులు చూస్తోంది. గుండె భారం ఒక్కసారిగా తీరింది.

“అక్కా, ఏంటే ఇక్కడున్నావ్. అమ్మ ఎదురు చూస్తోంది” అని దగ్గరికి వెళుతూ పిలిచా.

“ఆశ్రు నువ్వా .. ఇదిగో ఇవి పట్టుకోరా”  అని తన చేతిలో ఉన్నవన్నీ న చేతిలోకి రవాణా చేసింది. “ఏం అవ్వలేదు లేరా! బజ్జీలు తినాలని అనిపించింది. వేడిగా వేయ్యించుకుందామని ఇక్కడ ఆగాను.వీడేమో పిండి లేదు, కొనుక్కొస్తా అని వెళ్ళిపోయాడు” అని వివరించింది. ఆ బజ్జిల బండి వాడు మాకు నాలుగేళ్ళుగా తెలుసు. వాడు వాడి పెళ్ళాం రోజు సాయంత్రం పూట అక్కడ బజ్జీలు వేసి అమ్ముతూ ఉంటారు .

“అయినా పిండి లేకుండా బండి ఎలా పెట్టాడు” అని మాట పొడిగించా.

“పిండి లేక కాదు బాబు, ఈ రోజుకి బోణి అయిపొయింది . మూసేద్దాం అనుకుంటుంటే , అమ్మయిగారోచ్చి ..బజ్జీలు కావలి, ఏం పర్లేదు వెయ్యి అని పట్టుబడితే, పిండి కొనుక్కురాటానికి వెల్లాడయ్య” అని అక్కడే ఉన్న ఆ బజ్జి బండి వాడి పెళ్ళాం నాతో వాపోయింది.  “మా అమ్మ తప్పించి నాకు తెలిసిన ఆడవాళ్ళందరూ ఎందుకు ఇలా పెంకి ఘటాల్లా ఉన్నారు. వీళ్ళు మొండి వాళ్ళా ,నేను మేతకా ?” అని ఆలోచించుకుంటూ ఉండగా, ఆ బజ్జి వాడు వచ్చి, పిండి కలిపి ఒక డజను బజ్జీలు వేసాడు.

“ఐదు కట్టు,చాలు ” అని ఆదేశం జారి చేసింది అక్క. వాడు అంత కష్టపడి వేసినందుకు కనీసం గీరకీ చేయలేదని వాడి పెళ్ళాం గుర్రుగా ఉంది. నేను ఏం తెలీనట్టు అవతలికి తిరిగాను.

“పర్లేదు పది కొనుక్కోండి” అని మా అక్క మాటని దాటుతూ పది బజ్జీలు కట్టేసింది వాడి పెళ్ళాం. పొట్లం పట్టుకుని ఇంటికి నడక సాగించాం. నడుస్తూనే రోడ్డు మీదే సగం బజ్జీలు తినేసింది అక్క.

“ఇప్పుడు నువ్వు బలవంతంగా బజ్జీలు తినకపోతే ఏమయిందే?” అని ప్రశ్నించా.

“నోర్మూసుకొని ముందు అవి సరిగా పట్టుకోరా” అని నా చేతిలోని తన కోట్ ని, హ్యాండ్ బ్యాగ్ ని, పుస్తకాలని సవరించింది.

ఇంటికి చేరగానే “అమ్మాయి వచ్చేసిందే అమ్మడు” అని బిగ్గరగా అరిచి చెప్పి,తిరిగి  పేర్లు పడేదాకా ఆరోజుకి అయిపోయిన ఆ మూకీ ధారవహికనే చూడసాగింది అమ్మమ్మ.

“ఎందుకే లేటు ?బస్ అందలేదా” అని నీళ్ళ గ్లాస్ తెస్తూ అడిగింది అమ్మ.

“లేదమ్మా, అందరకి బజ్జీలు తెద్దామని ఆగాను” అని చెప్తూ, తనని చురుగ్గా చూస్తున్న నా డిప్ప మీద ఒకటి వేసింది.

“సరే,నాన్న వచ్చేలోపల తయ్యరయ్యి కూర్చో.” అంటూ మళ్ళి లోపలికెళ్ళింది అమ్మ.

“ఈ రోజు ఏమైందో తెలుసటే ?!! చెప్తే అవాక్కవుతావ్” అని అక్కకేసి అంది అమ్మమ్మ.

“పుష్పాన్ని ఇంట్లోంచి గెంటేశార చివరికి? సీతిక నిజం ఒప్పేసుకుంద?” అని చీకట్లో బాణాలు వేస్తోంది అక్క.
ఆ పేర్లు బట్టి వాళ్ళిద్దరూ రొజూ చూస్తున్న ఆ దిక్కుమాలిన ధారావాహిక గురించి చర్చించుకుంటున్నారని గుర్తించి లోపలికి జారుకున్నా.

Advertisements

2 thoughts on “అధ్యాయం – ఐదు

  1. Vamsi…. You have a unique skill of describing subtle human interactions in a simple, humorous way. Your style of writing is very engrossing, draws the reader into the situation, makes them relate to it in a very personal way..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s