విష్ణు మాయ

మావయ్య పక్కన నుంచొని తెలిసినా తెలియకపోయినా అందరినీ చూసి నవ్వుతున్న నన్ను గూర్చి అడిగారు ,మా అమ్మ పెదనాన్న బావమరిది కొడుకు – ‘అయితే next వీడేనా ? ఏరా ఎప్పుడు మరీ ?? వెతుక్కున్నావా already ?’ .

‘వీడికి ఇప్పుడే ఏంటి!! అయినా వాడిని అడిగితే ఎం చెప్తాడు !!’ – బదులిచ్చాడు మావయ్య నా తరఫున. ఆ ‘పెదనాన్న బావమరిది కొడుకు’ ఏమనుకున్నాడో ఏమో , లాభం లేదనుకొని ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు. జనంలో ఎటెళ్ళాడో కూడా కనపడలేదు. ఆయన అడిగినదానికి నేనేం అనుకుంటున్నానో పసిగడదాం అని మా మావయ్య నా వైపు చూసాడు తదేకంగా. నాకేం అర్థం కాలేదు అనట్టు నటించా.

ఈ మధ్య ఇదొక నసలాగ తయ్యారయ్యింది. ఏదన్నా function కి వెళ్దాం అనుకోవటం తప్పైపోయింది. ఎక్కడికెళ్ళినా కనీసం పది మంది తగుల్తారు , కనుబొమ్మలెగరేసి next నువ్వేనా అని అడుగుతూ. అడిగితే దాకా పర్వాలేదు, ఎదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. కాని చెప్పినదానితో సరిపెట్టుకోక ఇచ్చే ఉచిత సలహాలే తిక్కరేగేలా చేస్తున్నాయి. అందుకే ఎక్కడికీ వెళ్ళటం లేదు.  కాని ఇది మా మావయ్య కూతురి పెళ్ళి అవ్వటం వలన రాకతప్పలేదు .అయినా వచ్చాక తప్పుతుందా ,దానికి నేను ఎలాగో mental గా prepare అయిపోయా.  కొంచం సేపు అక్కడ నుంచొని ,తర్వాత అమ్మ దగ్గరికెళ్ళా. ఎక్కడినుంచోచ్చాడో తెలీదు కానీ , ఇందాక next నువ్వేనా అని అడిగి జనంలో కలిసిపోయిన ఆ బావమరిది కొడుకు మళ్ళీ వచ్చాడు. రెండు నిముషాలు మా అమ్మతో మాట్లాడి ,నా గురించి అడగబోతున్నాడు అని గ్రహించి జారుకుంటున్న నన్ను గూర్చి మళ్ళీ మా అమ్మని అడిగాడు. ‘మరి వీడికెప్పుడు చేద్దాం అనుకుంటున్నారు?’ అని . నా తిక్క నషాళంకి అంటేలా ఉంది, వీడెవడో గాని, నా mental stability కే టెస్ట్ పెట్టి తన్నించుకునేల ఉన్నాడని నవ్వుతూ క్రూరంగా చూడసాగాను.

‘ఇంకా ఎం అనుకోలేదు బావగారు. ఇరవై ఆరెగా. ప్రస్తుతానికి వాడిని అలా ఎంజాయ్ చేయనీయండి’. అని చెప్పింది అమ్మ .

‘ఇప్పుడు కాకపోయినా ,అసలంటూ చేయాలిగా. ఇప్పటి నుంచి మొదలెడితే కాని దొరకరు అమ్మాయిలు’ అని మొదలెట్టాడు. అక్కడే వాడి పీక కొరికెయ్యాలి అన్నంత కోపం వచ్చింది. అయినా తప్పు నాదే, silent గా అక్కడినుంచి వెళ్ళిపోకుండా, నా గురించి మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోవటం సంస్కారం కాదు అని ఆపిన నా పాడు బుద్ధిని అనాలి ముందు.

మొదలెట్టినవాడు ఆపకుండా అందరూ చెప్పే సోదే చెప్పసాగాడు .’దొరకరు ,దొరకట్లేదు, దొరికినా ఆడపిల్లలు తేలిగ్గా ఒప్పుకోవట్లేదు, కష్టం, జగర్తపడాలి,  ఇప్పుడు మొదలెడితే గాని అవ్వదు’ ఇలా చాలానే చెప్పాడు. సంబంధాలు దొరక్క నీరుగారిపోయి,చాలా కాలం పెళ్ళి కుదరక మిగిలిపోయిన ఉదాహరణలు కూడా చెప్పాడు ఒక రెండు మూడు.  ఆయన మాటలకి ,ఎప్పుదూ ప్రశాంతంగా ఉండే మా  అమ్మకి కూడా చిరాకొచ్చి తప్పించుకోటానికి ఆయన చెప్పినవన్నీ ఒప్పెస్కొంది.  ఆయన కార్యం నెరవేరగానే అంతర్ధానమైపొయాడు.  ఇలా ఆ రోజు కనీసం మరో ఇరవై మంది తగిలారు.

పెళ్ళి హడావుడి తీరాక మరుసటి రోజు మా ఇంట్లో రాత్రి భోజనం చేస్తున్న వేళ ,మా నాన్న గర్వంగా మా అమ్మకి తెలియజేసారు – ‘నిన్న మన మురళి గాడికి నాలుగు సంబంధాలు వచ్చాయి. పాపం బాగా వెంటపడ్డారు. వివరాలు అవి తీస్కోని మంచి రోజు చూసి కబురు చేస్తాం అన్నారు’.

‘అవునా !! మరి ఎవర్ని చూసినా  ఆడపిల్లలు దొరకట్లేదంటున్నారు !!’ అని మా అమ్మ చోద్యంతో ప్రశ్నించింది .

‘వాళ్ళ బొందలేవే !! అవి మిగితావాళ్ళకి . మనవాడికేంటి , చక్కగా ఉంటాడు ,మాంచి ఉద్యోగం’ అని దర్పంగా నా గురించి ముచ్చటపడ్డారు. గుంటూరులో పెరిగి చిలకలూరిపేటలో MBA చేసిన నాకు , ప్రకాశం జిల్లా గ్రామీణ బ్యాంకు లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. మూడేళ్ళ తర్వాత మొన్నే assistant manager గా ప్రమోషన్ కూడా వచ్చింది . ఒక్కగానొక్క కొడుకుని అవ్వటం వలన గారాబంగా పెరిగాను. ‘ఇక నాకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారన్నమాట’ అని నాకు చూచాయిగా అర్థమయ్యింది.

నాలుగు రోజులు గడిచాయి. ఎవ్వరి దగ్గరినుంచి ఏ కబురూ లేదు.  వివరాలు తీస్కోని phone చేస్తాం అన్నవాళ్ళ గురించి నాన్నకి ఆదుర్ద పెరిగిపోతోంది. ఇంకో పది రోజులు గడచినా ,విషయం ముందుకి సాగలేదు. చివరికి ఒక రోజు ‘ఇంకా ఎవరి phone రాకపోవటమేంటి!!’ అని  పేపర్ చదువుతూ పరధ్యానంగా ప్రశ్నించారు.

‘ఎవరు చేస్తాం అన్నారు’ ఎదురు అడిగింది అమ్మ.

‘అదే,పెళ్ళిలో మన వాడికోసం అడిగిన వాళ్ళు. ఇంక ఎప్పటికి చేద్దాం అనుకున్నారో!’ – అని వ్యంగ్యంగా చమత్కరించారు.

‘పోనీ, మీరు చెయ్యండి ,ఎవరు చేస్తేనేం. ఇంకా పాత రోజుల్లా పట్టింపులేమున్నాయి’.

‘ఎలా చెయ్యను. నా దగ్గర వాళ్ళ వివరాలేమీ లేవు’ – అని చిన్న గొంతుతో చెప్పారు.

‘అదేంటి , వాళ్ళు మనవి అడిగినప్పుడు,మీరు వాళ్ళని అడగలేదా ? కనీసం నలుగురిలో ఒక్కళ్ళనన్నా?’ – చురుగ్గా అడిగింది అమ్మ.

‘నలుగురంటే… అదేలే ఒకళ్ళిద్దరు… అయినా ఆ ఒక్కళ్ళైనా చేస్తాం అన్నారుగా, ఇంకెందుకులే అడగటం అని నేనేం అడగలేదు. అయినా చేస్తాం అన్నవాళ్ళు ఎందుకు చెయ్యలేదో !’ – అని టాపిక్ తనమీదనుంచి మళ్ళించటానికి ప్రయత్నించారు. అడిగారు కదా అని గర్వంగా వాళ్ళ వివరాలు ఎదురు అడక్కుండా దర్జా ప్రదర్శించారని అర్థం చేస్కొని, ఇక ఇప్పుడు అనేదేముందని మిన్నకుండిపోయింది అమ్మ చివరికి.

ఇక మా నాన్న మదనపాటు చూడలేక ,అమ్మే చివరికి చుట్టాల్లో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి నా గురించి అడిగినవాళ్ళ నెంబర్ తీస్కోని ఎదురు ఫోన్ చేసింది.

‘ఏమయ్యిందంట,ఎందుకు చెయ్యలేదంట’ – ఆత్రుతగా అడిగారు నాన్న.

‘జాతకాలు కుదర్లేదట!’.

‘అవునా! నాతో అప్పుడు మీరు ఒప్పుకుంటే చాలు, నక్షత్రాలు కూడా కలిసాయి అన్నారు.’

‘పిల్ల చేస్కోనందేమో!! అయినా అసలు వాళ్ళకి గుర్తుకూడా లేనట్టు ఉంది ఈ విషయం. ఆ.. ఊ.. అంటూ అయోమయంగా మాట్లాడారు. అసలు వాళ్ళు నిజంగానే అడిగారా ,మీరు అడిగారనుకున్నారా’.

‘నిజంగానే అడిగారు. ఊరకే ఎందుకు అనుకుంటా’ అని ఉక్రోషంగా బదులిచ్చారు.

ఈ సంఘటన మా ఇంట్లో పెద్ద ప్రభావమే చూపిందని చెప్పాలి. అయితే బయట అనేది నిజమేనన్నమాట అని మా అమ్మ గాబరపడింది. తన గారాల కొడుకుని ఎవరో వద్దన్నారని మా నాన్న భంగపడ్డారు. నిజంగానే ఇప్పటినుంచి చూస్తేనే గాని అవ్వదేమో అని ఒక అభిప్రాయానికి వచ్చారు. నా అభిప్రాయం కోసం అడిగారు. నాకు ఎం చెప్పాలో తోచలేదు. అందరు అబ్బాయిలు అనుకునట్టే ఎవరో ఒక చక్కని పిల్ల వస్తుందనుకున్నా కాని ఎలా వస్తుందో ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు ఎందుకు రాదో కూడా అర్థంకాలేదు.  ‘ఏమో ,మీ ఇష్టం’  అని చెప్పి ఊరుకున్నా. వాళ్లకి జవాబు చెప్పాక నిజంగా ఆలోచించటం మొదలెట్టా అసలు ఎప్పుడు చేస్కోవాలి పెళ్ళి అని.  మా అక్కలు,బావలు,అన్నలు ఎలా పెళ్ళిళ్ళు చేస్కున్నారా అని ఆరా తీసాను. సగం పైగా ప్రేమ పెళ్ళిళ్ళు. నా స్నేహితుల్లో కూడా పట్నంలో  ఉండేవాళ్ళకి చాలామందికి గర్ల్ ఫ్రండ్స్ ఉన్నారు అప్పుడే. గుంటూరులో ఉండే స్నేహితుల్లో కొంత మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి మేనరికంలోనే. ఇంతాకాలం గమనించని కొత్త విషయాలను గ్రహిస్తున్నాను.  అసలు నేనెందుకు ఎవరినీ ప్రేమించలేదు??!! శ్రద్దగా చదివి బుద్దిగా పెరగటం వల్లనా ?! అయినా బలవంతంగా మా కులంలోనే వెతుక్కొని ఎలా ప్రేమించను?ఒకే కులం కాకపోతే ఒప్పుకోరు! ఉన్నట్టుండి ఈ వివాహ వ్యవస్థ మీదే చిరాకుపుట్టింది.

అప్పుడే తెలిసింది. నా స్నేహితుడు శరత్ గాడి పెళ్ళి కుదిరింది, పెద్దలు కుదిర్చిన పెళ్ళే అని. వాడిని అభినంద్దిద్దాం అనే నెపంతో ,అసలు ఎలా కుదిరిందో కనుక్కుందాం అని వెళ్ళాను. కుశల ప్రశ్నలు ముగిశాక అసలు రంగంలోకి దిగాను..

‘ఏరా , ఎలా వచ్చింది సంబంధం’

‘ఎవరో తెలిసినవాళ్ళ ద్వారా వచ్చింది. వెళ్ళి చూసాం, నచ్చింది.’

‘చూడగానే ఎలా నచ్చింది.. ఒక పావుగంటలో? అయినా ఎం మాట్లాడకుండా ఎలా నిర్ణయం తీసుకున్నావ్?’

‘మాట్లాడాగా!!’

‘మరి చెప్పవే. ఎం అడిగావేంటి?’

‘నేను అడగలేదు ,తనే అడిగింది”

‘ఏమని??’ – నా గొంతులోని ఆత్రాన్ని ఇంక దాచటం కష్టమైపోతోంది .

‘ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు అని అడిగింది.’

‘ఇంటరా !! ఏ?? ఇంకా ?’.

‘ఇంకా అంతే,అదే అడిగింది. మరి ఎక్కడన్నా చూసినట్టు అనిపించానేమో’.

‘ఏంటి ఇంక అంతేనా, ఇంకేం మాట్లాడుకోలేదా ? అడగలేదా ?’ – ఆశ్చర్యచకితుడినయ్యాను .

‘ఇంకేముంటాయి అడగటానికి అసలు ? పెళ్ళైతే తెలుస్తాయిగా ఎలాగో . అయినా ఎందుకంత ఆశ్చర్యపోతున్నావ్’ అని ఎదురు ప్రశ్నించి నవ్వి ఊర్కున్నాడు.

ఇంటికొచ్చి పడుకునే దాకా,నాకు అదే ఆలోచన. అసలు అలా  ఎలా ఊరకే అలా చేసేస్కున్నారు పెళ్ళి . పెళ్ళిళ్ళు స్వర్గం లో జరగటం అంటే ఇదేనా? భగవంతుడి మీద భారం వేసి ,లెక్కలు చూస్కొని ఒకటైపోవటమేనా ? మన వివాహ వ్యవస్థ తర్కం ఉట్టి నమ్మకమేనా , ఉట్టి నమ్మకం కూడా కాదు , గుడ్డి నమ్మకం. నేనలా గుడ్డిగా చేస్కోలేను. అసలు ముందు చేస్కోటానికి కారణం వెతుక్కోవటంలోనే  ఆ రాత్రి గడచిపోయింది. ఇలా కాదు ప్రస్తుతానికి వాయిదా వేసి  ఒక రెండేళ్ళు ఆగి చేస్కుందామని నిశ్చయించుకున్నా.

పండక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. బంధువులందరూ కూడా వచ్చారు. అందరితో బాగా సరదాగా గడిపినా ,ఆ మూడురోజుల్లో నాలోని ఒక కొత్త కోణంని కూడా తెల్సుకున్నా. పెద్దవాడిని అవుతున్నా అని. నా అభిప్రాయలు నిక్కచ్చిగా ఉంటున్నాయి అని. నాకంటూ పద్ధతులు  తెలియకుండానే ఏర్పరుచుకుంటున్నా అని. ఆర్ధిక స్వాతంత్రంతో పాటు వచ్చే వెసులుబాటు వల్ల నాకంటూ ఒక జీవన శైలికి అలవాటు పడి, నా పద్ధతులు , ఆలోచనలే సమంజసం అనే మొండితనం ఆవహించేస్తోందని. అది నాలోనే కాదు, నా ఈడు మా cousinsలో కూడా గమనించాను. ఒక్కడినే ఉండటం వల్ల తెలియలేదు, కానీ నలుగురిలో ఉన్నప్పుడు , అందరూ అందరికి విలువిచ్చి కలసి ముందుకి నడుచుకోవాలనే విచక్షణ చాల మందిలో లోపిస్తోందని అర్థం చేస్కున్నా. చిన్నతనంలో అయితే మొండివాడు అంటారు ,అదే పెద్దవాళ్ళు ప్రదర్శిస్తే మూర్ఖుడు అంటారు.  ఎంత గమనించుకొని ఉన్నా, పెరుగుతున్నకొద్దీ ఆవహించేసే ఈ మూర్ఖపు మొండితనంతో  ఇంకో మనిషితో కలిసి స్వచ్ఛంగా, పరస్పరం ప్రేమతో గౌరవంతో జీవించటం కుదుర్తుందా అని భయపడ్డా. అందుకే ఇలాంటి ఒంటరి జీవన శైలికి స్వస్తి చెప్పి ,పెళ్ళికి ఇదే సరైన టైం అని మళ్ళి నిర్ణయానికి వచ్చాను.

మా నాన్న ఏవో రెండు మూడు వివాహ వేదికలకు హాజారయ్యి చాలా సంబంధాల వివరాలే తెచ్చారు. ఎన్ని చూసినా ఏవీ నచ్చట్లేదు. చాలా  మొహాలు నాకన్నా దిగదుడుపుగా ఉన్నాయేంటో విచిత్రంగా. నేను మాములుగా ఉండే ఐదున్నర అడుగుల చామనిచాయ కుర్రాడినే. కానీ బాగా తయ్యారవ్వాలనే ఆత్రుతతో పిచ్చి సోకులు చేస్కుని వికృతంగా తయ్యరయ్యిన అమ్మాయిల్ని చూసి ఒకింత జాలి కూడా వేసింది ..పాపం ఎలా పెళ్ళిళ్ళు అవుతాయో అని. ఇది ఊహించని పరిణామం మా ఇంట్లో  అందరికి.

‘ఆడపిల్లలు దొరకట్లేదు అంటే ఏంటో అనుకున్నా.. ఇలా ఉన్నాయేంటో మొహాలన్నీ , బావున్న వాళ్ళు దొరకట్లేదన్నమాట’ అని మా బామ్మ నిట్టూర్చి వెళ్ళిపోయింది.  ‘బావున్న వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు!! బావున్న వాళ్ళని ఎవరు వదుల్తున్నారు ? ప్రేమించి పెళ్ళిళ్ళు చేసేస్కుంటున్నారుగా.. ఉన్నవాళ్ళలో వెతుక్కోవటమే ‘ అని మాకు రుచించని జోక్ వేసి పగలబడి నవ్వాడు మా బాబాయి.

సంబంధాలు వచ్చేవి వస్తున్నాయి పోయేవి పోతున్నాయి. నాన్నకి ఇదొక హాబీ లాగా కూడా తయ్యారైపోయింది. నేను నెమ్మదిగా పట్టించుకోవటం కూడా మానేసాను. వాళ్ళకన్నా వీళ్ళు బావున్నారా,వీళ్ళకన్నా వాళ్ళు బావున్నారా అని compare చెయ్యటానికి ఇదేం కొనుక్కునే వస్తువు కాదు, మనిషిలోని సుగుణాలతో పాటు ఉండే చిన్న చిన్న లోటుపాట్లని కూడా స్వీకరించి అర్థం చేస్కొని చేస్కోవాలి అని నా ఆదర్శమైన భావాన్ని వెలియబుచ్చా మా అన్నయ్యల దగ్గర.  ‘ఇంక నీకు పెళ్ళయినట్టే ,అనే సమాధానం అందరి కళ్ళలో కనపడింది’ . అలా కుదరకపోయినా కనీసం గుడ్డి నమ్మకంతో కాకుండా కొంచం అర్థం చేస్కోవటానికి ప్రయత్నించి కాస్త గట్టి నమ్మకంతో అన్నా చేస్కుందామని అనుకుంటున్నా అని చెప్పా. అందరూ ముక్త కంఠంతో అల్ ది బెస్ట్ చెప్పి,మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎడారిలో ఎండమావిలా ఒక రోజు ఒక సంబంధం వచ్చింది.అమ్మాయి పేరు లావణ్య. పిల్ల మాంచి రంగు, మాంచి  చదువు, మాంచి అందం, మాంచి కుటుంబం ..ఇలా అన్ని ‘మాంచి’లు కలబోసిన సంబంధం.  ఏదైతేనేం మొత్తానికి అందరూ సంతృప్తి పడ్డ సంబంధం. అతిమంచి మాటలతో మభ్యపెట్టకుండా, నేను నేనులా మాట్లాడి పిల్లకి నచ్చి పిల్లని మెచ్చి చేస్కుందాం అని ఆలోచించుకున్నా.

పెళ్ళి చూపుల్లో నన్నూ లావణ్యను మాట్లడుకొమ్మని పెరట్లోకి పంపారు. చక్కగానే మాట్లాడింది. తన భావాలన్నీ నిక్కచ్చిగా చెప్పింది. ఎక్కడా మొహమాట పడలేదు.అడిగేవన్నీ అడిగింది.చెప్పేవన్ని చెప్పింది. నేనే ఒకింత మొహమాట పడి నీళ్ళు నమిలాను అనుకున్నది అనుకునట్టు మాట్లాడటానికి. అనిపించింది అనిపించినట్టు నిర్మొహమాటంగా మొహమ్మీదే చెప్పే అలవాటు నాకు లేకో , లేదా వచ్చిన ఈ ఒక్క మాంచి సంబంధం కూడా పోతుందనే గాబరానో, అనుకునట్టు మాట్లాడలేకపోయాను. ఎదురు,తను అలా మాట్లాడినందుకు ఒకింత అసహనానికి కూడా గురయ్యాను. పెళ్ళయ్యాక కూడా ఇలానే నిక్కచిగా ఉండి,సర్దుకుపోకుండా  ఉంటుందేమోనని అని భయం వేసింది.  మొత్తానికి బానే ఉన్నా,ఎక్కడో చిన్న సందేహం.

‘నిర్ణయం తీసుకున్నాక ,నచ్చితే phone చేస్తాం’ అని ఎదురు మాకే చెప్పారు వాళ్ళ నాన్నగారు. ముక్కున వేలేసుకొని ఇంటి ముఖం పట్టాం అందరం.

‘వారం గడిచింది, ఇంకా phone రాలేదు .. ఇది కూడా పోయినట్టేనా అత్తయ్యగారు’ అని పూలు కడుతూ మా బామ్మ దగ్గర విచారం వ్యక్తం చేసింది అమ్మ .

‘మన చేతులో ఎముందమ్మా ..అంతా విష్ణు మాయ’  అని సమాధాన పరిచింది బామ్మ.

రింగుమన్న ధ్వనికి ఇద్దరూ తలకాయ ఎత్తి చూసారు. అది, మోగుతున్న మా phone.

Advertisements

4 thoughts on “విష్ణు మాయ

  1. Is there a sequel or is it a happy ending ?? Anyways nice write up with a tinge of subtle comedy… Reminded me of my brother’s marriage which was a similar scenario as ur narration…good work…

  2. Great Read Vamsi..!! Very well written!!
    Loved these lines: 1.) చాలా మొహాలు నాకన్నా దిగదుడుపుగా ఉన్నాయేంటో విచిత్రంగా. LOL!!
    2.) అసలు నేనెందుకు ఎవరినీ ప్రేమించలేదు??!! శ్రద్దగా చదివి బుద్దిగా పెరగటం వల్లనా ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s