అధ్యాయం – ఆరు

నాన్న వచ్చేదాకా ఆలస్యం అవుతుందని మాకు ముందే భోజనం వడ్డించేసింది అమ్మ. నేను, అక్క, అమ్మమ్మ తినటం ముగించి పెరటిలోని మల్లె పందిరి కింద చేరాం కబుర్లకి.  సింహ ద్వారం తీసి ఉంచి, వీధి గేటు వేసిరావటానికి వెళ్ళిన నేను, నా సెల్ ఫోన్ చప్పుడుకి అటుగా వెళ్ళా. అప్పటికే ఐదు మిస్సుడ్ కాల్స్ ఉన్న వంద్య నుంచి ఆరో సారి వస్తోంది ఫోన్. నాకోసం ఎదురుచూస్తున్న అమ్మమ్మ,అక్క ని చూసి, ఫోన్ పక్కన పెట్టి పెరటిలోకి చేరాను.  అప్పటికే విసినికర్ర పట్టుకుని పడక కుర్చిలో చేరింది అమ్మమ్మ. పక్కన్న గచ్చు పైన అక్క, అటు పక్క పందిరిగుండా వెన్నెల కనిపించేలా నవారుమంచంపై నేను వాలాను.అమ్మ కూడా వచ్చి మాతో కలిసింది. చల్లటి పిల్ల గాలి, అప్పుడే మొగ్గ వేస్తున్న చక్కటి మల్లె పరిమళం , నిండు వెన్నెల ,కమ్మటి కబుర్లుతో మనసు అంతా  హాయి నిండుకుంది.

“ఆహా ,దొరలు తినే గాలి ” అని మొదలెట్టి, పాత కాలపు ఆచార వ్యవహారాలు ,తన చిన్న నాటి సంగతులు చెప్పసాగింది అమ్మమ్మ. ఎప్పుడూ  వినేవే అయినా, మళ్ళి కొత్తగా వింతగా వింటున్నాం అందరం.

ఇంతలో గేటు చప్పుడుకి అందరం తిరిగి చూసాం. ఒకదాని తర్వాత ఒకటితో వరుసగా ఉండే గదులగుండా మా నాన్న లోపలికి రావటం కనిపించింది.

“అప్పుడే అందరూ కబుర్లకి చేరిపోయారా ?! ” అని మమ్మల్ని పలకరిస్తూ ,స్నానం చేసి రావటానికి వెళ్ళారు.  వాళ్ళిద్దరూ భోజనం చేయటానికి కంచాలు పెట్టె పనిలో పడింది అమ్మ.

స్నానం చేసొచ్చి ,తువ్వాలు ఆరేయ్యటానికి పెరట్లోకి వచ్చి .. “ఏం చిన్న నాన్న , ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ ” అని నన్ను ఇండైరెక్ట్ గా తనతో కబుర్లు చెప్పమని పిలిచారు. ఇంట్లో చిన్న వాడిని అవ్వటం వలన, నేనంటే అందరికీ ముద్దే. నా కబుర్లు వింటూ భొంచేయటం ,పడుకోవటం మా నాన్నకి ముచ్చట మరియు అలవాటు. అందుకుగాను మంచం మీద నుంచి ఆయన పక్కన చేరాను. ఉన్న చోటు నుంచి లేచి ఇంకొంచం అవతలికి పడక కుర్చీ జరుపుకుని మళ్ళి కూర్చుంది అమ్మమ్మ.  అది మర్యాదపూర్వకంగా అల్లుడిగారికి కోసం అని అర్థం చేసుకొని నాలో నేను నవ్వుకున్నాను ..“ఏంటో ఈ పాతకాలపు వ్యవహారాలు” అని. అక్క వచ్చి అమ్మకి, నాన్నకి ఏం కావాలో చూసి వడ్డిస్తోంది.

ఇంతలో “తల్లీ , వాళ్ళు  వచ్చే వారం వస్తారట ,నీకు పరవాలేదా ? ఎమన్నా ఉంటే చెప్పమ్మా ,మారు తేది చూద్దాం కావాలంటే ” అని అక్కని అడిగారు నాన్న.

“ఎవరు నాన్న ?” నేను ప్రశ్నించాను మధ్యలో.

“అప్పుడేనా ! మరి అబ్బాయి వస్తున్నాడా ? ఇంకా సమయం కావలన్నారన్నారు మొన్న . మళ్ళి ఎమన్నా మాట్లాడారా ఇంతలో ?” అడిగింది అమ్మ.

“పొద్దున్న రావుగారు ఫోన్ చేసారు. వచ్చే వారం వస్తాం,మనకి పర్వాలేదా అని అడిగారు. నేను ఏ విషయం రేపు ఖరారు చేస్తా అని చెప్పాను.”

“మరి అయితే ఏంటి , వచ్చే వారమా ?”

“ఏంటి వచ్చే వారం ?” మళ్ళి అర్థం కాక మధ్యలో అడిగాను నేను. ఇంతలో అమ్మమ్మ కేకేసింది నన్ను అటు రమ్మని వీళ్ళకి అడ్డు లేకుండా ఉండటానికి.

“లలితమ్మ ఏది చెప్తే అది.” అని అక్కని చూసి బదులిచ్చారు నాన్న. అక్క అమ్మని, అమ్మమ్మని చూసి ఊరుకుంది.

“వచ్చే శుక్రవారం దశమి అయ్యింది. శనివారం ఏకాదశి. ఆ రోజు అయితే బాగుంటుందండి” అని దిశానిర్దేసం చేసింది అమ్మమ్మ. ఒక్క నిముషం అందర్నీ చూసి ,అయితే వాళ్ళకి అదే చెబుతాను అని ముగించారు నాన్న.

“అబ్బా !! ఏంటి ? ఎవరు వచ్చేది ? ఎందుకు వచ్చేది ? ఎక్కడికి వచ్చేది ?” అని మా అమ్మమ్మని ప్రశ్నలతో విసిగించాను.

“అక్కయ్య ని చూస్కోటానికి  పెళ్ళి వారు వస్తున్నారురా. కుర్రవాడు పేరు మనోహర్. అమేరికాలో ఉంటాడు. కుదిర్తే పెళ్ళి” అని కట్టే కొట్టే తెచ్చే అనట్టు వివరించింది.

“అవునా !! అక్కకి పెళ్ళా ? అప్పుడే ? నాకు చెప్పలేదే మరి ? అక్కకి ఇష్టమేనా ? ఎలా ఉంటాడు మనోహర్ ? నేను సెలవు పెట్టాలా ?ఎప్పుడు ఉంటుంది పెళ్ళి ? మరి దాని చదువు ? అమెరికా వెళ్ళిపోతుందా మరి ? నాకెందుకు చెప్పలేదు?” మళ్ళి విసిగించా.

“చిన్నవాడివి కదా అని చెప్పలేదు. అయినా వింటున్నావుగా .ఈ రోజే పూర్తిగా విషయం తెలిసింది వాళ్ళు వస్తునట్టు. ఫోటో నాన్న దగ్గర ఉంది, అడుగు చూపిస్తారు” అని చెప్పి పడుకోవటానికి వెళ్ళిపోయింది అమ్మమ్మ. అమ్మా నాన్నా ఎదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ గదిలో , బహుశా దీని గురించే కావచ్చు.అక్క కూడా యధాలాపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. నాకు ఈ వార్త ఎవరికన్నా చెప్పి విషయం పంచేస్కోవాలని ఆదుర్ద పెరిగిపోతోంది. పడుకోవటానికి నా గదిలోకి వెళ్ళి వంద్యకి ఫోన్ చేశా. అప్పటికే ఇరవై మిస్డ్ కాల్స్ ఉన్నాయి.

“ఏమైపోయావ్ హనూ ,ఎన్ని సార్లు చేసానో తెలుసా ?”.

“బయటకి వెళ్లాం నేను అమ్మ, ఫోన్ ఇంట్లో మర్చిపోయా,ఇదుగో ఇప్పుడే వస్తున్నా ” అని సావధానంగా సమాధాన పరచటానికి ఎప్పటిలానే అబద్ధం ఆడాను.

“అవునా, మరి భోజనం చేసావా ?”

“ఆ అయ్యింది .అయ్యాకే చేస్తున్నా.ఏంటి అన్ని సార్లు ఫోన్ చేసావ్ ?” అని అసహనంగా వేరే ప్రశ్నలు కొన్ని సంధించా ,ఉన్నపళాన అక్క విషయం ఆత్రంగా చెప్పలేక.ఏమని,ఎలా,ఎంత వరకు చెప్పాలో తెలీక.

“మధ్యానం ,దిగాలుగా కనిపించావ్.ఏమయ్యిందా అని కనుక్కోవటానికి చేశా” అని బదులిచ్చింది.నేను అనుకునట్టే తను నన్ను గమనించింది. నేను నవ్వుతూ లేనంటే తానూ బాధపడుతుంది. అందుకే అన్నీ తెలిసినా ఏం తెలీనట్టు మాట్లాడి, నేను బానే ఉన్నా అని ఖారారు చేస్కొని తృప్తిగా పడుకోవటానికి ఫోన్ చేసింది ఎప్పటిలానే.

నేను ఏదన్నా చెప్పటానికి మొత్తానికి సందు దొరికింది. ” అక్కకి పెళ్ళి చూపులు వచ్చేవారం. కుదిర్తే చేసేద్దామని చూస్తున్నారు త్వరలో. ఆ హడావుడి, ఆలోచోనలో ఉన్నాం అందరం” అని అదేదో నాకు ఎప్పటినుంచో తెల్సిన విషయంలా చెప్పా.

“అపుడే పెళ్ళేంటి మీ అక్కకి, ఇంకా చదువు అవ్వలేదుగా! ఇంత చదువు చదివించింది, పెళ్ళి చేసి పంపించెయ్యటానికా ?” అని ఎదురు అడిగింది. వంద్యది  చాలా చురుకైన స్వభావం. జీవితంలో ఉన్నతంగా ,అందరూ చెప్పుకోదగ్గ,మెచ్చుకోదగ్గ స్థాయిలో స్థిరపడాలని , ఆలోచనలన్నీ ఎప్పుడూ ఉచ్చంగా  ఉండాలని ,ఏదన్నా గొప్పగా సాధించాలని తన అభిప్రాయం. తన అభిప్రాయంతో ఎవరన్నా విభేదించినా, తను వాళ్ళతో ఏకీభవించదు. తన నైజం తనదే అనట్టు దృడంగా ఉంటుంది.

నేను చెప్పిన తాజా వార్త విని, ఆత్రంగా వివరాలు అడగకుండా,ఎదురు సూటి ప్రశ్నలు సంధించటం నాకు రుచించలేదు. తానూ మాములుగా అడిగినా, నేను మరి తను ఎగతాళి చేస్తోందేమో అనే భావనతోనే ఆలోచించి ,వంద్య మీద ఎదురు చిరాకు తెచ్చుకున్నాను. ఇంక విషయం చెప్పటం ఇష్టం లేక, మాట మార్చేసాను. “ఏంటి ఇంకా పడుకోలేదా, నాకు నిద్రొస్తోంది ఇంక” అని పెట్టేశాను. అనవసరంగా చెప్పాను అని తలుచుకుంటూ ,ఎలా తనపై మళ్ళి ఆధిపత్యం ప్రదర్శించాలా అని ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s