చామంతి పూలు

శాంత , కృష్ణ  , రామా దేవి , జ్యోతి , నీరజ  , రాధ , షీలా , ఉమా , స్వర్ణ  , భాను – ఇవన్నీ నేనూ మా అన్నయ్యా మాకు ఊహ తెల్సినప్పటి నుంచి ఎప్పుడూ తరచూ వినే పేర్లు.  వీరందరూ మా అమ్మకి దాదాపుగా 40 ఏళ్ళుగా స్నేహితురాళ్ళు.  కరెంటు పోయినప్పుడు సాయంత్రం వేళ వసారా లోనో , వేసవి మధ్యానం పూట భోజనం తర్వాత AC గదిలో విశ్రమిస్తునప్పుడో, రైలు ప్రయాణంలోనో, బజారుకెళ్ళే దారిలోనో-  ఎప్పుడు తీరిక దొరికినా  కురిసే మా అమ్మ కబుర్ల జడి వానలో జాలువారే తన  చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్ని విన్నా ఇంకా కొత్తగానే ఉంటాయి. మూడు దశాబ్దాల క్రితం నాటి కట్టుదిట్టమైన సాంప్రదాయ భారతీయ సమాజంలోని వారి చదువులు,ఆటలు,అల్లర్లు, ఆంక్షలు అన్ని వింతగా,సరదాగానూ తోస్తాయి.  చదువులు పూర్తయ్యిన వెంటనే పెళ్ళిళ్ళై అందరూ తలా ఒక చోట  స్థిరపడిపోయి వారి వారి కుటుంబ వ్యవహారాల్లో ఎంత మునిగిపోయినా,  ఆ నాటి ఉత్తరాల లోకం  నుంచి నేటి సెల్ ఫోన్ల కాలం వరకూ ఇంకా వాళ్ళ స్నేహాన్ని అంతే గట్టిగా ఎలా పదిలపరచుకున్నారో నాకు ఎంతో ఆశ్చర్యం గొల్పే విషయం.  సరదా, చమత్కార, నిర్మలమైన , కలుపుగోలు స్వభావం  మా అమ్మ సొంతం. మరేలానో, అందరినీ తనవైపుకు తిప్పుకునే గంధపు చెక్క పరిమళం వంటి సులక్షనమైన మనస్తత్వం నాకూ ,మా అన్నయ్యకూ అబ్బలేదు . అందుకేనేమో, ఎల్లప్పుడూ దరిదాపుల్లోనే ఉండేందుకు ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా  మా మిత్రగణం సంఖ్య ఎప్పుడూ నాలుగు మించి దాటలేదు.  చెప్పుకునేందుకు – అవసరాలకి , పై పై సరదాలకి  ఎన్నో పేర్లున్నా, నిజంగా నీ బాగు కోరుకునే ఆప్తులు ఎవార్రా అంటే పట్టుమని పది పేర్లు కూడా ఉండవు. ఉన్న పేర్లనే తిప్పి తిప్పి చెప్పాలి.

55793d6f4d75dd46a075bb2c5445fe74-7

మా అమ్మ స్నేహితురాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబాలూ మాకు సుపరిచయమే కొన్ని. ఆ స్నేహితురాళ్ళల్లో ఎవరన్నా ఎప్పుడన్నా కలిస్తే  ‘ఎరా ఎలా ఉన్నావ్’ అని వచ్చి ఆలింగనం చేస్కొని ప్రేమగా పలకరించే వారి తీరు చాలా ఆప్యాయంగా ఉంటుంది. పలకరింపు పక్కనపెడితే ,ఎదో ఒకే ఇంట్లో వాళ్ళలాగే  చనువుగా నాతో మా అన్నయ్యతో మాట్లాడటం ఇంకా బాగుంటుంది.

మా అమ్మతో నా ముందే నన్నే ‘ఎంటే వీడు ఇలా నల్లగా కాకిలా తయ్యరయ్యాడు’ అని అడగటం నాకు భలే నవ్వొస్తుంది . ఇదే కాకుండా ఇంకా :

“ఏరా అమ్మేది ?”  ;

“ఆటో వాడికి ఈ పది రూపాయలు ఇచిరా” ;

“అబ్బబ్బ నువ్వూ ఆ రఘు గాడు ఇద్దరూ ఇంతే!” ;

“మీ అమ్మ అలానే అంటుంది కాని, నువ్వెళ్ళరా” ;

“ఏమిటే వీడు, ఇలా రోజురోజుకీ బూజుకర్రలా అయిపోతున్నాడు ” ;

“బంగారు తండ్రిలా ఉన్నావ్” ;

ఇలా వేర్వేరు సందర్భాల్లో వారు మాట్లాడే తీరు గమనిస్తే  మొహమాటంగా కలిసే బంధువుల కన్నా వీరే  ఇంకా దగ్గరగా అనిపిస్తారు. వారి మాట తీరు, వారి స్నేహానికి అద్దంపడుతుంది.

ఇలా ఇంతమంది ఆప్తమిత్రులు నాకెందుకు లేరు అని ఆలోచించుకున్నప్పుడు – నేటి చదువులు, ఉద్యోగాలు, పరిస్థుతల వల్ల అంతమందితో అంతటి దగ్గరి అనుబంధం ఏర్పరుచుకుని,పెంచుకుంటూ, కొనసాగించే తీరిక ఓపికలు  లేవు అనే సమాధానం తోస్తుంది. ఇది కేవలం నాకు పరిమితమైన విషయమే కాదు, ప్రస్తుత కాలంలో నూటికి తొంబై మంది పరిస్థితి ఇదే. విద్యార్థి దశ నుంచి ఉద్యోగ జీవనంలో పడ్డ దశాబ్ద కాలంలో , నా మిత్ర గణం సంఖ్య తగ్గిందే కానీ పెరిగింది లేదు. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టి  పరిచయం అయ్యి ,ప్రదేశం మారగానే మర్చిపోయే పై పై స్నేహాలే కాని, ఎప్పటికీ నిలిచిపోయే స్నేహాలు కచ్చితంగా పెరగలేదనే చెప్పాలి.  కానీ మా అమ్మ మైత్రివనం మాత్రం నానాటికీ పెరుగుతూనే వస్తోంది. చామంతి పూలవంటి తన స్నేహితురాళ్ళ  చెలిమి ఇంకా గుబాళిస్తూనే ఉంది. ఒక తోబుట్టువుగా,  భార్యగా, పెద్ద కోడలిగా, తల్లిగా, ఇంటి యజమానురాలుగా  తాను ఎదుర్కొన్న ఆంక్షలు, చేపట్టిన బాధ్యతలు , చేసిన సేవలు అన్నీ కూడా తనకు సంబంధించినంతవరకు పరిస్థితులే అయినా కానీ, ఎంత శ్రద్దగా పరిస్థితి తగట్టు కార్యాచరణ చేసిందో అంతే ఒడుపుగా తన స్నేహాలని విడువకుండా పదిలపరచుకుంటూ వచ్చింది.

ఒక మనిషి ఉండే ప్రదేశాలు మారతాయి, పరిస్థితులూ మారతాయి, కాని బంధాలు మాత్రం వీడిపోని విధంగా ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకోలేని పక్షంలో ఉన్నావన్నా పదిలపరచుకోవాలి. అలా చేయగలిగిన మా అమ్మని చూస్తే నాకు ఎప్పుడూ ముచ్చటే !

photo ref: bapu online gallery ( google ;D)

3 thoughts on “చామంతి పూలు

  1. Nee eee swagatalu vinataniki, chadavataniki (telugulo) chalaa bavunnayi. Nizamine nee aantaryam, swabhavam, ninnu, telusukovalante/ardham chesukovalante, PG kooda chadivite chala bavuntundi. Chadavali ani korika. I hope and sincerely wish she can read Telugu.

Leave a comment