ఈ తూరుపు .. ఆ పశ్చిమం

1999:

పడమటి సంధ్యా రాగం అనే పేరు పడుతూ ‘ఈ తూరుపు ..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా’  అని పాట వినగానే లంఘించి వెళ్ళి ముందర గది సోఫాలో వాలిపోయాడు పన్నెండేళ్ళ రవిగాడు. పేర్లు పడే ఆద్యంతం చూపించే ఆ అమేరికా రోడ్లు,ఇళ్ళు , ఊరు అంతా నోరు తెరిచి చూస్తూనే ఉన్నాడు.

“అమ్మా అది అమేరికా నా ?”

“అవును” అని బదులిస్తూ రవిగాడిని దగ్గరకి తీసుకుంది సుమతి.

“పెద్దయ్యాక నేనూ వెళ్తా . నిన్ను కూడా తీస్కెళ్తా ” దర్పంగా పలికాడు. మురిసిపోయింది సుమతి.

“మరి నన్నూ ? ” అడిగింది బామ్మ.

” అప్పటికి నువ్వు ఉండవుగా ! ” ఠపీమని వచ్చింది సమాధానం. ఇంకా మురిసిపోయింది సుమతి.

ఎక్కడుంటుందో , అక్కడికెలా వెళ్ళాలో, ఎందుకెళ్లాలో ,వెళ్ళి ఏం చెయ్యాలో తెలియకపోయినా ..ఎందుకో రావిగాడికి అమేరికా అంటే ఎదో తెలియని ఉత్సాహం ,అక్కడికెళ్ళిపొవాలని తగని ఉబలాటం. చిన్నపటినుంచి టీవీలో పడమటి  సంధ్యారాగం ఎన్ని సార్లు వచ్చినా తప్పక చూస్తాడు… చూసిన ప్రతీసారి ..నేను అమేరికా వెళ్ళిపోతా అని అంటాడు. అదొక సుందర లోకం , తప్పక వెళ్ళాలని వాడి అభిప్రాయం.

* * * * * * *

“రవీ !! సునీతక్క వచ్చిందంట అమెరికా నుంచి. పక్కింటి పిన్నిగారు చాక్లెట్లు ఇస్తా, నిన్ను రమ్మన్నారు”.

వినగానే పూనకం వచ్చినట్టు ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు రవిగాడు. సందుమూల బడ్డీకొట్లో దొరికే బిళ్ళ చాక్లెట్లు లాంటి మూడు చాక్లెట్లు, రెండు చేతులతో పెద్ద దోసిటితో ఇచ్చింది పక్కింటి పిన్నిగారు.  రవిగాడు ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నాడు. వాళ్ళ నాన్న కొనిచ్చే పెద్ద కాడ్బరి కూడా ఈ బిళ్ళచాక్లెట్ల  ముందు  దిగదుడుపు అయ్యాయి వాడికి. కుక్కలకి కూడా కోరుకునపడని ఆ బిళ్ళలనే చప్పరించి చప్పరించి తిన్నాడు వారం పాటు. అమేరికా గురించి ఎవరు ప్రస్థావన  తెచ్చినా .. “మా పక్కింటి సునీతక్క అమేరికా లో ఉంది” అని గొప్పగా చెప్పుకుంటాడు,అదేదో వీడి సొంత అక్క అయినట్టు .

2005:

“ఈస్టు బతుకు వేస్టు మామా ..ఇక..  వెస్ట్ బతుకు బెస్టు మామా  …” వెన్నెల సినిమా చూసొచ్చాడు రవిగాడు. శూన్యంలోకి చూస్కుంటూ , లోలోపల నవ్వుకుంటూ రేపే చంద్రమండలానికి ప్రయాణం అనట్టు ప్రవర్తిస్తున్నాడు. రాత్రి భోజనం చేస్తూ వాళ్ళ నాన్నతో చెప్పాడు :

“నాన్న, నేను అమేరికా వెళ్దాం అనుకుంటున్నా?”

“ఆ !! ఎందుకు?!?” వాడి అసందర్భపు నిర్ణయానికి అవాక్కయ్యాడు అప్పారావు.

వాడికంటూ ఒక సొంత కారణం లేకపోయినా, వెన్నెల సినిమాలో, అందరూ చదువుకోసం అమేరికా వెళ్ళటం చూసినట్టు జ్ఞాపకం ఉంది కాబోలు .. “పై చదువులకి నాన్నా.” గంభీరంగా పలికాడు.

ఒక నిముషం అటు ఇటు అలోచించి “ఇంకా మూడేళ్ళ చదువు ఉందిగా ,కనియ్య్ ముందు అది. అ తర్వాత నీ ఇష్టం” అని జాబు చెప్పాడు అప్పారావు. మళ్ళి ఉక్కిరిబిక్కిరి అయ్పోయి పిల్లిమొగ్గలు వేసాడు రవి.

రవి సంగతి ఎలా ఉన్నా అప్పారావుకి మాత్రం తిన్నది హరాయించట్లేదు.

“ఎంటే వీడు అప్పుడే అమేరికా అంటున్నాడు. ఏంటి పరిస్థితి. నిజంగా వాడు వెళ్తా అంటే , మనం తూగగలం అంటావా?” మదన పడ్డాడు అప్పారావు.

“వాడు ఈ రోజు అన్నది రేపు అనడు. నిజంగా వాడు వెళ్తా అన్నరోజు చూద్దురు. ప్రస్తుతానికి మర్చిపోండి” అని సమాధాన పరించింది సుమతి.

“ఏదైతేనేం. వాడు కూడా అమేరికా వెళ్తే బాగుంటుంది. “ అని అప్పారావు కూడా అమేరికా వెర్రి తలకి ఎక్కించేస్కున్నాడు. అంతటితో ఆగకుండా మర్నాడు ఆఫీసులో సహోద్యోగుల దగ్గర, మా వాడు అమేరికా వెళ్ళిపోతున్నాడు అని ప్రగల్భాలు పలికేసాడు అత్యుత్శాహంతో.

2008:

“అరెరే అరెరే మనసే జారే ..” హ్యాపీడేస్ సినిమా చూసొచ్చాడు రవిగాడు. ఆ సినిమా పుణ్యమా అని అమేరికా గోడు మర్చిపోయాడు . వాడు ప్రేమ అనుకొని పులిహోర కలుపుతున్న దివ్యతో కలిసి సినిమాలోలాగా సెటిల్ అయిపోదామని నిశ్చయించుకున్నాడు. అందులో భాగంగా ముందు కాంపస్ ఇంటర్వ్యూ కొట్టాలని పుస్తకం పట్టాడు. పది కంపెనీలు వచ్చాయి ,పోయాయి- రవిగాడు మాత్రం ఇంకా ఉద్యోగ వేటలోనే ఉన్నాడు.

“కనీసం అఖారు దాకా వచ్చి పోయిన వాళ్ళని చూశాంగాని ,ఇలా మొదటి తడవలోనే తప్పే వాడిని వీడినే చూశాం” అని చురుకేసింది బామ్మ. అమ్మా  కొడుకులు ఉడుకున్నారు.  రవిగాడితో లాభం లేదనుకొని దివ్య రఘుగాడితో జండా ఎత్తేసింది. తరగతిలో ఇంకా ఉద్యోగం రాని పదిమందిలో రవిగాడు ఒకడు. ఇంకా ప్రయత్నించి నవ్వులపాలు అవ్వటం ఇష్టం లేక. మళ్ళి అమేరికా జపం మొదలెట్టాడు. ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళందరూ చేసేది అదేగా మరి !

“నాన్నా. ముందు చెప్పినట్టు నేను అమేరికా వెళ్దాం అనుకుంటున్నా.”

“చదువుకేనా ?” అప్పారావు నిర్ధారణకి అడిగాడు.

“ఆ.. !” .

“మరి కాంపస్ ఇంటర్వ్యూ అన్నావ్ ?”.

“లేదు, నేను అమెరికానే వెళ్తా. ఇంకా చదువుకోవాలని ఉంది. ఎలాగో చెయ్యని ఉద్యోగం ఎందుకు, అందుకే ఇక కాంపస్ జాబ్స్ కూడా చూడను”.

“అదేమిట్రా .. నిన్నటిదాకా బానే ఉన్నావుగా. పైగా, ఉద్యోగం వస్తే కంపెని వాళ్ళే పంపిస్తారు అంటున్నారు.. డబ్బులు కూడా మరి చూసుకోవాలిగా “ హితవు పలికింది సుమతి.

“లేదు. నేను చదువుకుంటాను ఇంకా.” పెద్ద పిస్తా లాగ సాగదీసాడు.

“సరే. మరి కావాల్సిన అప్లికేషన్స్ అవీ చూసుకో. మిగతావి నేను చూసుకుంటా” సముదాయించాడు తండ్రి.

ఒక తీరూ దారీ లేక గుంపుతో సాగిపోయే సగటు గొర్రె తలకాయి విద్యార్థిలాగ  వాళ్ళు వీళ్ళు నోటికొచ్చింది చెప్పినవన్నీ రాస్కోని ఐదారు అమేరికా కాలేజీలకి అప్లై చేసాడు. వాడికొచ్చిన మిడిమిడి మార్కులకి ఆ డబ్బా కాలేజీల్లో రావటమే ఎక్కువ అనుకుంటూ ఉండగా, మొత్తానికి ఒక అడ్మిషన్ వచ్చింది.  అంతమాత్రానికే ఏదో ఒబామా కొలువులో ఉద్యోగం వచ్చేసినట్టు కుటుంబమంతా దీపావళి, దసరా, రంజాన్,క్రిస్టమస్ అన్ని కలిపి జరిపేసుకుంది.  కొడుకు అమేరికా వెళ్తున్నాడు అనే సంబరంతో కిందా మీదాపడి  ఏ లోటూ లేకుండా అన్నీ సమకూర్చాడు అప్పారావు. ప్రయాణ సన్నాహాలన్నీ చురుగ్గా సాగుతున్నాయి. వెళ్ళేది డబ్బు ఖర్చుపెట్టి చదవటానికే అయినా, అమేరికా అనే సరికి డబ్బు ఇంకా జోరుగా ఖర్చవుతోంది. వంట సామాను, పిండి వంటలు, బట్టలు, సూటుకేసులు , వాడక సామాగ్రి … పిల్లని కాపురానికి పంపుతునట్టే తయ్యారయ్యింది పరిస్థితి. గుండు సూది నుంచి తల దువ్వెన దాకా అన్ని కొన్న వైనం చూసి:

“చదువు అబ్బాకపోయినా, వీడు ఇక్కడినుంచి కొనుక్కెళ్ళేసామానుతో అక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టి దర్జాగా బ్రతకొచ్చు” అని వ్యగ్యాస్త్రం వేసింది బామ్మ.

రవిగాడిని దిగ్విజయంగా సాగనంపటానికి అత్తలు, బాబాయిలు, పిన్నిలు, బామ్మ తాతలు అందరూ తయ్యరయ్యారు. ఎదో ప్రవాహంలో చేపపిల్లలా కొట్టుకుపోతున్నాడు కాని, రావిగాడికి ఇంకా ప్రస్ఫుటమైన అవగాహన లేదు అమెరికా వెళ్ళి ఏం సాధించాలో. ప్రయాణ తేది రానే వచ్చింది.

రావిగాడికి వీర తిలకం దిద్దారు, హారతి పట్టారు, దేవుడి ముందు నుంచోబెట్టారు. పట్టుకొని ఏడ్చారు, దిష్టి తీసారు ,మళ్ళి ఏడ్చారు ,మొత్తానికి విమానాశ్రయానికి అందరూ తరలి వెళ్ళారు. అక్కడ పిల్లల్ని అమెరికా పంపే ఇలాంటి బాపతులే ఇంకో పది కనపాడ్డాయి. వాళ్ళని చూసి, అయితే మనవాడు ఒక్కడే కాదులే ఇలా వెళ్ళేది అని కొంత కుడుటపడ్డారు. రవిగాడు లోపలికి వెళ్ళిన మూడు గంటల దాకా బంధు వర్గం అంతా బయట గచ్చు మీద కూర్చొని వెళ్ళే ప్రతీ విమానాన్నీ చూసి ఆఖరుకి ఇంటిముఖం పట్టారు.

సశేషం ….

Advertisements

2 thoughts on “ఈ తూరుపు .. ఆ పశ్చిమం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s