నామవాచకం

రెండు రోజుల్లో నాకు తెలిసిన లోకం అంతా తారుమారు అయ్యింది. మా చిన్నమ్మాయి దివ్య కానుపు కోసం నేనూ మావారూ ఊడిగం చెయ్యటానికి అమెరికా వచ్చాం.  మంది, మార్బలం, అయినవాళ్ళు మరియు  వెసులుబాటు  అన్నీ ఉంటాయి –  పురుడుకి భారత దేశం రమ్మంటే, వాటన్నిటికన్నా మించిన  అమెరికా పౌరసత్వం ఇక్కడే ఉంటుంది అని మమ్మల్నే రమ్మన్నారు మా కూతురు అల్లుడు. ఇక తప్పలేదు. అన్ని ప్రయాణ సూచనలు వాళ్ళు తేలికగానే  చెప్పినా, మాకు మాత్రం కష్టతరమే అయ్యింది ఒక విధంగా. సరిగా రాని భాష, అలవాటు లేని తిండి, నీలుక్కుని ఇరవై గంటల ఏక కుర్చీ ఆసనం , చేతినిండా ఏవేవో డాక్యుమెంట్లు, తనిఖీలు,గుండె బితుకు బితుకుమనే విమాన కుదుపులు, ఎలా వాడలో తెలియని పాయకానాలు వెరసి ఒక పెద్ద అవాంతరం దాటినట్టే అయ్యింది. కాకపొతే ఒక్క ఉపశమనం ఏంటంటే విమానం సగం పైన మావంటి వృద్ద దంపతులే ఒక పెద్ద తోడులా అనిపించారు. బహుశా వాళ్ళు కూడా ఇలా మాలా పనీపాట చూడటానికే వస్తున్నారు కాబోలు. ఎదో దుబాయ్ వెళ్ళే మేస్త్రి కూలీల్లా, అమెరికాలో వెట్టి చాకిరికి కుదిరిన పనివాళ్ళలాగ అనిపించి లోపల నవ్వుకున్నా.

కొత్తగా రిటైరైన మా వారు మాత్రం హుషారుగానే ఉన్నారు, అంతా తిరిగి చూసేద్దామని. ముందుగానే ఆలోచించి ఒక తెలుగు నిఘంటువు తీస్కోచ్చారు, పేర్లు పెట్టేందుకు  అర్థాలు వెతకడానికి. ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, అదేదో మయసభలాగ. పెద్ద వాకిలి, అంతకన్నా పెద్ద పెరడు. ఉండేది మాత్రం ఇద్దరే! నెలలు నిండుతున్న నా కూతురు తాత్సారం చెయ్యకుండా అక్కడి పని,వంట సామాగ్రి ఎలా వాడలో చక చకా నేర్పేసింది. నేనూ ఇక రోజువారీ పనుల్లొకి దిగాను. మూడో రోజే ఇంట్లో కూర్చొని కూర్చొని బోరు కొట్టిన మావారు పుట్టబోయే వాడికి పేరు వెతికే కార్యక్రమంలోకి దిగారు. అల్లుడు ఇంటికి రాగానే

“నా మనువడికి పేరు పెట్టేసా నేను!” అని చమత్కరించారు.

“అవునా, ఏం పేరు?” అని అడుగుతూ తెరిచిన కిటికీలన్ని మూసేసాడు రిషి .

“సీతా కృష్ణ సహిష్ణు !”  కొత్త మందు కనుకున్న శాస్త్రవేత్తలాగా ఉబలాటంగా చెప్పారు.

హహహాహహహా  అని పిచ్చి నవ్వు నవ్వుతూ,, “దివ్స్ మీనాన్న పెట్టిన పేరు విన్నావా” అంటూ  పైకి వెళ్ళిపోయాడు.

మా దివ్య అయితే కనీసం ఆ పేరుని గుర్తించలేదు కూడానూ. ఇటు తండ్రిని అటు భర్తని ఎవ్వరినీ నొప్పిచకుండా తప్పించుకుని ఊరుకుంది. చిన్న మొహం వేసుకొని ఏమీ చెయ్యలేక ఉడుక్కున్నారు మావారు.

చప్పిడి కూరలు,మిగిలిపోయిన బన్ను ముక్కలు, రోజుల పాటు దాచుకునే రొట్టెలు తింటూ  కిందా మీదా పడి వండుకునే మా కూతురు అల్లుడు, వంటిల్లు ముఖం కూడా చూడటం మానేసారు ఇప్పుడు. ఎప్పుడూ ఎవ్వరితో కలవకుండా ఎవ్వరినీ ఇంటికి పిలవకుండా బిజీ అని సాకు చెప్పే వాళ్ళు  ఇప్పుడు అందర్నీ భోజనానికి  పిలుస్తున్నారు. అన్ని పనుల్ని  ఒక ముసలి యంత్రంలా చేసుకుపోతున్న నన్ను  గూర్చి మా అల్లుడు రోబో సినిమాలోని   ఓ మర మనిషి మాలోకి రా..!  అంటూ పాడి ఆటపట్టించటం మొదలెట్టాడు. వచ్చే పోయేవాళ్ళకి చేసిపెట్టే పనిలో కనీసం నాకు రోజైనా ఎదో ఒక విధంగా గడుస్తోంది. మావారే కాలు కాలిన పిల్లిలాగా అసహనంగా మారారు ఏం తోచక. ఉన్న రెండు వారాల్లో అరడజను పైగా కుటుంబాలు వచ్చాయి భోజనానికి – చూసి పోయే పేరిట. మొహాలన్నీ మనవాళ్ళలానే ఉన్నా, వాళ్ళ పేర్లే ఒకపట్టాన బుర్రకి ఎక్కలేదు.

వెంకీ , క్రిష్, దీప్స్, కే, సాగ్, లక్కి మొదలుగు పేర్లు వింతగా కొత్తగా తోచాయి మాకు. వాటిని ఒక పజిల్ లాగ ఆలోచిస్తే వెంకటేశులు, క్రిష్ణమాచారి, దీప్తి, కామేశ్వరి, సాగర్, లక్ష్మి అని తెలుసుకున్నాం ఆ తరువాత.ఆ మాటకొస్తే మా అమ్మాయి లలిత సుగుణ దివ్య ,అల్లుడు ఋష్యేంద్ర శరత్ కూడా దివ్స్ ,రిషి అనే పిలుచుకుంటున్నారు. ఇవన్నీ చూశాక ఇక మనువడికి పేరు పెట్టె పని నుంచి నిష్క్రమించారు మావారు.

గృహనిర్బంధక  చెర నుండి విముక్తి పొంది మేమే రోజూ ఒక నాలుగు వీధులు తిరిగి రావటం అలవాటు చేసుకున్నాం. అర మైలుకొక ఇల్లు ఉంది. తక్కువకి వచ్చిందని ఊరి పొలిమేరల్లో అమెరికా పల్లెటూళ్ళో ఇల్లు కొనుక్కోవటం వల్ల ఈ పరిస్థితి అని బోధపడింది.  మావారులోని ఉత్సాహం  కృష్ణ పక్ష చంద్రుడిలాగ నశిస్తోంది. నెమ్మదిగా మాలాంటి ఒక జంటే పరిచయం అయ్యింది మాకు ఆ వీధిలోనే. మొదట్లో బానే ఉన్నా పోను పోను భయం మొదలైంది మాకు. ఆ జంట ఇక్కడికి రావటం ఇది పదో సారిట. ఉద్యోగాలు చేసే పిల్లలు, భాష రాని పట్టించుకోని మనుమలతో ఒంటరితనానికి బానిసైపోయిన వాళ్ళు – దొరికిన మమ్మల్ని వాళ్ళ వ్యథల్తో, బాధలతో పీక్కు తినటం మొదలెట్టారు. ఆవిడైతే మున్ముందు మా పరిస్థతి కూడా అంతే అని హెచ్చరించి బెదిరించింది ఒక అడుగు ముందుకేసి. బయటకొస్తే వాళ్ళు పట్టుకొంటారని తిరిగే నాలుగు వీధులు కూడా చూడకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాం మళ్ళి.

ఇంతలో మా దివ్య, రిషేలే ఒక పేర్ల పట్టికతో ప్రత్యక్షమయ్యారు  ఓ రాత్రి భోజనం వేళ.  ఉన్నట్టుండి అల్లుడు అప్రకటిత దాడి మొదలెట్టాడు :

“రూషిత్ , రేయాంష్ ,అవికేష్ , లవష్, విక్రుణ్, సూలిక్, కుహంగ్, జతిల్ ..” అని ముగించాడు. ఇవి వింటూనే నాకూ మావారికీ ముద్ద మింగుడు పడలేదు. నేను మిన్నకుండిపోయాను. ఆయన మాత్రం యథాలాపంగా ఇంకా చూస్తూనే ఉన్నారు రిషిని.

“వీటిలో మీకు నచ్చింది చెప్పండి మావయ్య” అని యక్ష ప్రశ్న వేసాడు రిషి.

“ఇవన్నీ పేర్లేనా అమ్మా పుట్టబోయే వాడికి?” అని ఎదురు దివ్యని అడిగారు మావారు.

“అవును నాన్న. మాకైతే అన్నీ నచ్చాయి. తేల్చుకోలేకుండా ఉన్నాం!” అని ముగించింది క్లుప్తంగా.

ఈ పరిణామంతో పూర్తి నిశ్శబ్దం అలుముకుంది మా ఇద్దర్ని. శూన్యంలోకి చూస్తూనే నడుం వాల్చాం. అర్థరాత్రి దాటవస్తుoడంగా ఒక్క ఉదుటున లేచి ఆయన తెచ్చిన నిఘంటువు తిరగవేస్తున్నారు. ఆ పేర్లకి అర్థాలు కాదు, అసలు  అలాంటి పదాలే కనిపించకపోయేసరికి మళ్ళి డీలా పడ్డారు.

“ఏమిటే ఇది! ఇవి పేర్లకి కాదు, ముందు అసలు  వాడుక పదాలకి కూడా చలామణి కాని శబ్దాలు. ఎలా చెప్పాలి వీళ్ళకి ?!” .

“మీరుచెప్పెదీ లేదు. వాళ్ళు వినేది అంతకన్నా లేదు.విచారించకుండా పడుకోండి!” అని హితవు పలికాను.

మేమిద్దరం మరో మాట మాట్లాడుకోలేదు మరుసటి రెండు రోజుల దాకా.

“స్వరాజ్యం, నాకు ఇక్కడ నచ్చటం లేదే! ఈ ఊరు, వీళ్ళ తీర్లు, ఆ పేర్లు ,ఇన్ని చాకిర్లు .. ఇవన్నీ మనకి వద్దే. మన ఊరు వెళ్ళిపోదాం. పిచ్చో ఎచ్చో ఇక మన బతుకులు మనం బతుకుదాం.ఆ పక్కవీధి అనాధ వృద్దుల్లాంటి బ్రతుకు మనకి అక్కర్లేదు. ఈ మమకారాల ముందరకాళ్ల బంధాలు ఇప్పుడు తెంచుకోకపోతే, మున్ముందు ఇంకా వేదన తప్పదు. వద్దు, వెళ్ళిపోదాం” అని ఆసాంతం నీరుగారిపోయారు.

“మీ ఇష్టంఅండి” నేనూ తలాడించాను. వచ్చిన కార్యం నెరవేరే దాకా ఉందాం అని అనుకున్నాం.

ప్రసవ తేది రానే వచ్చింది. అంతా సుగమంగా జరిగింది. తరువాతి రెండు వారాలు ఇంకా చాకిరీ హడావుడిలో గడిచిపోయింది. బిడ్డకి రూహంగ్ అని పేరు పెట్టారు. ఇంతక ముందు చెప్పిన పట్టికలోంచి ఏది పెట్టాలో తేల్చుకోలేక ,వాటిని కూడా ఇంకా కలగా పులగం చేసి ఇంకోటి సృష్టించి పెట్టారు. ఏదైతేనేం, మేము అసలు దాని మీద ఇక దృష్టి సారించలేదు.

“నాయనా రిషి, ఇక మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తగిన ఏర్పాట్లు గట్రా ఎమన్నా చూస్తావా?” గొంతు పెగిల్చారు మావారు.

“అదేంటి నాన్న, అప్పుడే ఏం? అమ్మ కూడా సాయం ఉంటుంది నాకు  ” అని దివ్య అడ్డు వేసింది.

“ఇంకేముందమ్మా , ఈ పరిస్థితి ఎప్పుడైనా తప్పదుగా ఇక. అక్కడికొస్తే చేసి పెడతాం తప్పకుండా” అని నేను తేల్చి చెప్పేసాను, చోటు పెట్టకుండా. చిన్న మొహం వేసింది చిన్నది.

మా తిరుగు ప్రయాణ ఏర్పాట్లు అన్ని సిద్దం అయ్యాయి. మా స్థానే ఇక్కడ పనులు చూసుకోవటానికి దివ్య అత్తగారు వస్తోందని చెప్పాడు రిషి. కన్నవాళ్ళకి  ఈ పేగు పాశం ఎప్పటికీ తీరని ఋణం కాబోలు.

వెళ్ళేటప్పుడు ప్రయాణ ఆందోళనతో కనపడ్డ తోటి మొహాలన్నీ , తిరుగు ప్రయాణంలో ప్రశాంతంగా తోచాయి నాకు. విమానం భరతఖండం మీద దిగుతూనే నాకూ,మావారికి కళ్ళనీళ్ళు జాలువారాయి. అవి తిరిగి గూటికి చేరినందున ఆనందభాష్పాలో, లేక పిల్లలకి ఇంకొంత దూరమైనందున బాధో మాకే తెలీలేదు. ఆరు దశాబ్దాలు గడిచిన శేష జీవితంలో ఇంకా జీవన పాఠాలు నేర్చుకోవడం ఎంతకాదన్నా కష్టతరమైన విషయం.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగంత్యక్త్వ కరోటియః లిప్యతేన సపాపేన పద్మ పత్ర మివాంభస (భగవద్గీత 5-10)   అంటూ ఇక కృష్ణతత్వ స్మరణకి ఉపక్రమించాము.

Advertisements

3 thoughts on “నామవాచకం

  1. This is by far the best of your works! As I mentioned earlier, I urge you to publish it..! I love your style of writing…lucid and simple…. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s