ముక్కు మీద వేలు

నాంది:

స్వర్ణకమలం చిత్రం : నేటి కాలంలో కూడు గుడ్డ పెట్టని శాస్త్రీయ కళలని అయిష్టంగా నేర్చుకుంటున్న మీన, తన గురువైన తండ్రిని తన ఈ అసమంజస విద్యాభ్యాసం గూర్చి ప్రశ్నిస్తుంది.

” అయిహిక బంధాల నుండి విముక్తి చెంది మోక్షం పొందే సాధనాలమ్మా ఈ కళలు “ అని వస్తుంది సమాధనం తండ్రి నుంచి.

ఇదే ప్రశ్నకు నీ సమాధనం ఏంటి అని పక్కన ఉన్న తన అక్కయ్యను చూడగా :

“నిధి చాలా సుఖమా ? రాముని సన్నిధి సేవా సుఖమా !! “ అని కల్యాణి రాగంలో త్యాగరాజ కృతి వినపడుతుంది జాబుగా .

                                                                             ———–  ****** ————

ప్రస్తుతం:

పట్టుమని పాతికేళ్ళు కూడా నిండకుండానే నా సమవయస్కురాలైన సుగుణతో నా పెళ్ళి జరిపించారు పెద్దలు. సుగుణ, పేరుకు తగ్గట్టే మంచి ఓర్పు,నేర్పు,పొందిక,నడవడిక గల చక్కని పిల్ల. బి.కాంలో పట్టా తన విద్య అయితే, శాస్త్రియ సంగీతంలొ డిప్లొమ తన ఆభరణం. ఊళ్ళోనే ప్రభుత్వ సంగీత కళాశాలలో టీచర్. నేనూ బి.కాం పూర్తి చేసి,బ్యాంకు పరీక్షలు రాసి స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ గా చేరాను. గుంటూరుకి అరగంట దూరంలో తాడికొండలో మా బ్రాంచి. నేను పుట్టి పెరిగినదంతా గుంటూరులోనే. ముందు పెద్ద వాకిలి, వెనకాల అంతకన్నా పెద్ద పెరడుతో నాలుగు కుటుంబాలు నివాసముంటున్న పెద్ద ఇల్లు మాది. నాకు పెళ్ళి అయ్యాక, పైన ఒక వాట ఖాళీ చేయించి, నేనూ సుగుణ అక్కడే కాపురం ఉండేలా మా నాన్నగారితో చెప్పి ఎర్పాటు చెయించింది మా అమ్మ.

రోజూ తెల్లవారి ఆరింటికి మా ఉదయం. వాకింగుకి బయల్దేరే మా అమ్మ నాన్నగార్లతో, అదే మైదానంలో షటిల్ ఆడటానికి వెళ్తాం నేనూ సుగుణ. తిరిగి వస్తూనే కింద అందరం కాఫి తాగి ఇంక తమ తమ పనుల్లో దిగుతాం. నేను పొద్దున తొమ్మిదింటికి వెళ్ళి సాయంకాలం ఐదున్నరకల్లా ఇల్లు చెరతా. ఆరింటికల్లా డజను మంది పిల్లలొస్తారు సుగుణ దగ్గర సంగీతం నేర్చుకోవటానికి. వాళ్ళతోపాటే, ఆరేసిన బట్టలు మడతపెడుతూ కమ్మని పాటలు వినటానికి మా అమ్మ కూడా వస్తుంది. నేను మా నాన్నగారు కింద ఉన్న చెట్ల తోటపనికి దిగుతాము ఆ గంట సేపు. ఆ తరువాత ఎనిమిదింటికల్లా భొజనం ఆనక డాబా మీద కబుర్లతో పదింటికల్లా నిద్రకి ఉపక్రమిస్తాము. పెద్ద దిక్కుగా ఉన్న తలిదండ్రులు, సహధర్మచారిణిగా సుగుణ, నిలకడ గల ఉద్యోగాలు, హాయిగొల్పే చుట్టుపక్కలతో రోజూ సంత్రుప్తికరమైన నిద్ర నా భాగ్యం.

ఓక రోజు, పొద్దున్నే కాఫి కబుర్లలో మా పెద్దమ్మ కూతురు సుష్మ అమెరికా నుంచి వచ్చిందని చెప్పింది మా అమ్మ. పేరుకి పెద్దమ్మ కూతురైనా, సుష్మ నాకన్న కొన్ని నెలలే పెద్దది. బాగ దగ్గరవాళ్ళే. చదువు పూర్తిచేసి, అమెరికాలోనే ఉద్యొగం సంపాదించి, దానితోపాటే వయసులో రెండేళ్ళు చిన్నవాడైన మరాఠి వాడిని ప్రేమించి పెళ్ళిగోల దాకా వచ్చింది. నేను సుష్మని చూసి ఐదేళ్ళు పైనే అవుతొంది. చదువుకునే రొజుల్లో అది అమెరిక వెళ్ళేముందు చూడటం ఆఖరు . సన్నగా, చక్కని జడతో, చిన్న బొట్టుతో మంచి కళగల సుష్మ మోము నాకు ఇంకా గుర్తే. ఆ మర్నాడె మా ఇంటికి కూడా వచ్చింది ఆ మారఠి వాడిని తీస్కొని. సుష్మ వస్తోందని నేను ఇంకో గంట ముందే వచ్చా. గేటు తీసి లోపలకి వస్తున్న నన్ను చూసిన సుగుణ, తన మెరిసే కళ్ళతో నవ్వుతూ కింద వంటింట్లో మా అమ్మ దగ్గరకి వెళ్ళిపొయింది. మా అమ్మ అదే నవ్వుతో బయటకి వస్తూ ఇదుగో సుష్మ వచ్చింది, నీకోసమే చూస్తున్నాం అని గుమ్మందాక వచ్చింది. నేను లోపలికి వెళ్తూనే “హాయ్ రా మోహన్ !!” అని వచ్చి ఆలింగనం చేస్కుంది సుష్మ. రెండు చేతుల్లో మిఠాయిలు, పకోడిలుతో అలవాటులేని ఈ అమెరిక ఆలింగనానికి అలానే నిటారుగ నుంచుండిపోయా. పక్కనే ఉన్న ఆ పిల్లకాయి మరాఠి వాడు “సూ….! ”అని పిలిచాడు, తననీ పరించయం చెయ్యమని సంకేతం ఇస్తూ.

“ఓహ్ షిట్! మర్చిపోయా. ఇదుగో వీడెరా అమిత్. నీకు కాబోయే బావ. అంటే ఇంకా ఇంట్లొ నాన్న ఒప్పుకోలేదనుకో. “ అని బిగ్గరగా నవ్వుతూ ఆ మరాఠి వాడిని పరిచయం చేసింది. నాకు ఇంకా అంతా గందరగోళంగానే ఉంది. బిగతగా పొట్టి చొక్కా – బిరుసు పాంటుతో, విరబోసుకున్న ఎర్ర రంగు జుట్టుతో నా చేతిలోని పకోడీ పొట్లంలాగా గుండ్రంగా మారిపోయిన సుష్మ ఆకారాన్ని ఇంకా నేను జీర్నించుకునే ప్రక్రియలోనే ఉన్నా. అంతలోపే ఆ మరాఠి వాడు వచ్చి సరదా నెపంతో సుష్మ మీద పడుతూ ,వాడికి అర్థంకాకుండా ఏం మట్లాడుకుంటున్నాం అని అంతకన్నా బిగ్గరగా పగలబడి నవ్వుతూ అడుగుతున్నాడు. ఎదురుగా వంటింట్లో సుగుణ ఇంకా నన్ను చూసి నవ్వు చిందిస్తూనే ఉంది. బహుసా నా ఈ అయోమయ జగన్నాధరూపం ముందే ఊహించింది కాబోలు. నాకు సుష్మ తీరు, భాష, రూపం కొత్తగా కన్నా చాలా వింతగా తొచాయి. దాని చదువుకు అయిన అప్పు సంగతి ఎలా ఉన్నా, మరాఠి వాడితో పెళ్ళికని వాళ్ళ నాన్నని ఒప్పించటానికి, చుట్టాలని మెప్పించటానికి అందరకీ అమేరికా బహుమతులు బానే తెచ్చింది.“కాలంతో మనమూ మారలిగా పిన్నీ! నాన్నని ఒప్పించే పూచీ నీదే !” అంటూ మా అమ్మ చేత మాట తీస్కొని వెళ్ళింది. అమెరికాలో ఉన్నందుకు దాని మాట చెల్లుబాటు అవుతుందనే అనిపించింది నాకు. “పెద్ద దేశం వెళ్ళారంటే పెద్దవారైనట్టే కామోసు!” అని అన్నా సుగుణతో ఆ రాత్రివేళ డాబా మీద కబుర్లలో. తనది వేరే ఉద్ధేశం కాబోలు,నా విచక్షణకే వదిలేస్తునట్టు ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది.
అలానే ఒక ఆదివారం, సుగుణ వాళ్ళ అమ్మా,నాన్న ,తమ్ముడూ వచ్చారు తెనాలి నుంచి ,కూతురు అల్లుడిని చూసివెళ్ళటానికి. వియ్యాలవారింట్లొ మర్యాద నిలుపుకోవటానికి ఎప్పటిలానే బుట్టెడు పళ్ళతో, జున్నుతో వచ్చారు. అందరికి భొజనం కింద ఇంట్లొ అని ముందే ఆహ్వానించారు మా నన్నగారు. సుగుణకన్నా, రెండేళ్ళే చిన్నవాడైన హరీష్ ఈ సారి ముళ్ళ జుట్టు,పిల్లి గడ్డంతో ప్రత్యక్షమయ్యాడు. బెంగుళూరులో సాఫ్టువేరు ఉద్యోగం ఈ మార్పుకి కారణం అని వెంటనే తెలిసింది. ముఫ్ఫైవేల సంపాదనతో హంగు ఆర్భాటంతో బానే ఉన్నాడు. అటు ఇటుగా, ఒకే వయసు వాళ్ళం అవ్వటంతో, నాతో చనువుగానే ఉండటం హరీషుకి అలవాటే. భొజనం తరువాత సరదా షికారు పేరుతో బయల్దేరాం ఇద్దరం. ఒక సందు తిరిగామో లేదో “బావా ఆపు !” అని బడ్డి కొట్టు దగ్గర ఆగి, అద్దంలో పిల్లిగడ్డం సవరించుకుంటూ ఒక సిగరెట్టు తాగి మల్లి వచ్చి బండి ఎక్కాడు.

“నాకు ఇటలీ ఛాన్సు వచ్చేలా ఉంది బావా. వెల్తే నేనూ, రమ్యా ఇద్దరం వెళ్తామేమో” అని అన్నాడు. రమ్య వీడు ప్రేమిస్తున్న సహోద్యోగి అని చెప్పకనే అర్థమయ్యింది. నేను వివరాలు ఏమి అడగదలుచుకోలేదు. సుగుణ దగ్గర తన కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఇరుకునపడటం నాకు ఇష్టం లేదు.

“ఒహ్, మరి ఎప్పుడు వెళ్ళొచ్చు?” అని మాత్రం అడిగాను.
“తొందర్లోనే. వెళ్తే మూడేళ్ళ వరకూ రాము. అక్కడే ఉందాం అనుకుంటున్నాం” అని నాకు అక్కర్లేని రమ్య సంగతి కూడ చెప్తున్నాడు. బహుశా నా ద్వార ఇంట్లో వాడి విషయం చెప్పిద్దామని అనుకుంటున్నాడని అర్థమయ్యింది. తప్పించుకొవాలన్నా ఇక వీడు నాకు తప్పనిచ్చేలా లేడు.
“ఇంట్లొ తెల్సా ?” అని నా ప్రమేయం ఎంత వరకూ అవసరం అని తెల్సుకుందామని అడిగాను.

“ఇప్పుడే ఎందుకు తెలియటం. టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. బెంగుళూరులో ఇదంతా మములే బావా ఇప్పుడు. ఇంట్లొ వాళ్ళకి చెప్పినా అర్థంకాదు” అని నేనేమని అర్థంచెస్కోవాలో నాకే వదిలేసాడు. నాకు అందుకే ఇంట్లో తొందరగా పెళ్ళి చెసారని అనిపించి నవ్వుకున్నా. వెంటనే సుష్మ సంగతి గుర్తొచ్చి

” నువ్వు చూసే అమ్మాయి నీ వయసేనా” అని అడిగాను, సుగుణ తలిదండ్రులు ఎంతమేర తట్టుకోవాలో బేరీజు వేయటానికి.
” చిన్నదే. అనే అనుకుంటున్నా. ఏం? పెద్దదైతే ఎమయ్యింది? “ అని సుష్మ మాటలే వల్లించాడు. నవ్వి ఊరుకున్నా. అటు ఇటుగా వాడి వయసు వాడినైనా, జట్టు మాత్రం పాతకాలం పెద్దవాళ్ళ జట్టుతో ఉన్నట్టు అనిపించి నాకే ఇబ్బంది వేసింది ఇంకేం మట్లాడాలో తెలియక.

ఆ తరువాత ఇటలీలోనే ఎలా స్థిరపడిపొదాం అనుకుంటున్నారో, ఎలా సంపాదించి ఏ ఏ దేశాలు తిరుగుదామనుకుంటున్నారో, చిన్నవయసులోనే కూడగట్టిన పెద్ద డబ్బుతో తొందరగా ఉద్యోగవిరమణ చేసి శేష జీవితం ఎలా హయిగా గడుపుదాం అనుకుంటున్నారో అన్ని చెప్పేసాడు. తాడికొండలో నా స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంకన్నా, ఇంకా ఏ విధంగా ఏమీ రూపుదాల్చని వాడి పేకమేడల సాఫ్టువేరు కూలి ఉద్యోగమే ఇంపుగా అనిపించింది నాకు.

సుగుణ తలిదండ్రులు తెనాలికి తిరుగుప్రయాణం చెశాక, రాత్రి కబుర్లలో హరీష్ సంగతీ చూచాయిగ చెప్పా. వాడి ఇటలీ స్వప్నం వాడికన్నా హుషారుగ చెప్పా. అన్నీ విని మళ్ళీ ఏం మట్లాడకుండా తన ఉద్ధేసం వేరే అనట్టు విషయాన్ని నా విచక్షణకే వదిలేసింది.

నా బుర్ర ఇంకా ఈ అస్థిర వ్యవహారల గూర్చి, అనువుగాని కలల స్వప్నాల గూర్చి ఆలోచించకముందే, మా ఇంటి వసారాలోంచి నిశి రాత్రి వేళ కమ్మని పాట. అది మా సుగుణ గొంతే…

“నిధి చాలా సుఖమా ! రాముని సన్నిధి సేవా సుఖమా?!” అని నన్ను ప్రశ్నిస్తూ, సంతొషంగా ఉన్న మా మనసుల్ని, జీవితాల్ని ఇలాంటి పరాయి ఆలోచనలతో ప్రభావితం కాకుండా మనదైన గమ్యం పట్ల బుద్ధిని లగ్నం చేయమని హితవు పలికింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s