సంకుంటుంబం

“పెద్ద ఇల్లు, పెరడు, పాడి గేదెలు, పనివాళ్ళు, పిల్లలు మొత్తం కలిపి ఒక ఇరవైమంది దాక ఉండేవాళ్ళం . అదికాక వచ్చిపోయే జనాలూ బంధువులూ. ఊళ్ళోనే తక్కిమా చుట్టాలందరూ ఉండేవాళ్ళు. ఎదైనా పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇక చెప్పక్కర్లేదు. ఆ రోజులు, ఆ వాతవరణం, ఆ పద్దతులూ అన్నీ వేరు” అని బామ్మ మా చిన్నప్పుడూ నిద్రపోయేప్పుడు చెప్పే కబుర్లన్నీ కలలో వచ్చి కలవరపెట్టాయి. మెలకువ రావడంతో ఇంక చెసేదేంలేదని ఒక చెత్తో నిద్ర కళ్ళు నులుముకుంటూ మరోచేత్తో దిండు పక్కనే ఉన్న నా మొబైల్ని తడిమి అందుకున్నా. whatsappలో అప్పుడే అమ్మ దగ్గర్నుంచీ శృతినుంచీ బోలెడు మెసేజీలు. వీళ్ళకీ నాలానే నిద్రపట్టినట్టులేదు, అప్పుడే లేచారు. నెమ్మదిగా దిగి కింద బెర్త్లో కూర్చుని ఇంటికి ఫోన్ చేశా.

అమ్మా…

ఏం నాన్న, చెరావా? ఎక్కడ ఉంది బండి?

లేదమ్మా ఇంకో గంట పడుతుంది. లేచారా? ఏం చేస్తున్నారు?

ఆ లేచాం.ఇదిగో బామ్మ మట్లాడుతుందిట.

హలో, బామ్మా

కేశవా ! నిన్న నీ శుభలేకలు అచ్చునుంచి వచ్చాయిరా. సాయంత్రమే కూర్చోని అడ్రెస్సులవీ రాసి అందరికీ పోస్ట్ చెసేశాం. తీరాచూస్తే ఎమయ్యిందో తెలుసా! ‘సపరివారసకుటుంబంతో ‘ బదులు ‘సంకుంటుంబంతో ‘ అని తప్పు అచ్చుపడిందిరా. కుటుంబం కుంటుపడిందిరొయ్. ఇందాకే మారు చూస్తే కనపడింది.

అవునా. హహ ! పొనీలే బామ్మ. ఈ రొజుల్లో అవన్నీ అంతతీరిగ్గా ఎవరు చదువుతారులే !

నేను చదవలే?! నాలంటి వాళ్ళే మన కుంటుంబంలో ఇంకా ఉన్నార్రోయ్ ” అని నవ్వింది.

కరష్టే బామ్మోయ్!” అని వక్కాడించాను.

“అమ్మ మళ్ళీ చెస్తా అంది.నేను కూడా ఇంక జపం చేస్కుంటా. ఇదే చెబుదామని తీస్కున్నాలే. జాగర్తగా రా నాన్న” అని పెట్టేసింది.

ఎదురుగా కూర్చుని నా మాటలు అన్నీ విన్న ఒక తాతగారు రెడీగా ఉన్నారు నాగురించీ నా జీవితంగురించీ యక్షప్రశ్నలు సంధించటానికి. రైలు ప్రయాణాల్లో ఇలాంటివి ఇప్పటికే బాగా అలవాటయ్యి,రణరంగంలో పార్ధుడి లాగా సిద్ధపడ్డాను ఆయన ప్రశ్నలు చ్ఛేదించటానికి. ఒక్క నిముషంలోనే సంగ్రామం మొదలయ్యింది.

“చదువుకుంటున్నావా బాబు? ఇంటికి వెళ్తున్నావా ? ఎవరిదీ పెళ్ళీ?” అని ఒక వాక్యంలోనే ముచ్చటగా మూడు ప్రథమ కుతూహలపు ప్రస్నలని సంధిచేసి అడిగేశారు.

ఎలాగో సిద్దపడిన నేను ఇంక మొదలుపెట్టా …

“లేదండీ. బొకారో స్టీల్ ప్లాంట్లో ఇంజినీరుగా చేస్తున్నా. వచ్చేవారం నా పెళ్ళి. ఇంటికి బయల్దేరాను.”

“ఒహో అవునా! శెభాష్! నువ్వే లేటు అన్నమాట వెళ్ళటం.ఈ పాటికి అందరూ వచ్చేసుంటారుగా!”.

“అందరూ ఇంకా రావాలి.నేనే ముందు వెళ్ళటం”

“అదేలే ! ఇదివరకులా ఎమీలేదుగా ఇప్పుడు. ఆ ఒక్కరోజుకి వస్తారులే బంధువులూ. పెళ్ళికి మీ నలుగురు ఉంటే చాలు. మిగితావాళ్ళది ఏముందీ! “

“నేను ఇంకా రావాలి అని చెప్పింది మా నలుగురించేనండీ. మా నాన్నగరు బళ్ళారినుంచి రేపొస్తారు.అనుకోకుండా బ్యాంకు సెలవ కష్టమయ్యింది ఆయనకి. మా అక్కయ్య యెల్లుండి దిగుతుంది అమేరికానుండి. బావగరూ పెళ్ళికి ముందురోజు వస్తారు.కాబోయే అమ్మాయి కూడా ఈ పాటికి ఇంటికి చేరుతూ ఉండాలి నాలాగే. పాపం మా అమ్మ ఒక్కత్తే మా బామ్మని పెట్టుకుని అన్ని పనులూ చూస్కుంటోంది ప్రస్తుతానికి”

“నలుగురూ నాలుగు దిక్కులన్నమాట! అమేరికాలో ఎక్కడ ఉంటారు మీ అక్కయ్యవాళ్ళూ?”

“అక్క డల్లాస్.బావ వర్జీనియా. పెళ్ళికోసమని,బావకోసమని ఇక్కడ ఉద్యోగాన్ని వదిలి అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉద్యోగం కోసమని వేరే చోటకి మారాల్సొచ్చింది.”

“వార్ని !! మావాడు కూడా ఆన్సైట్ అని యేడాది పాటు అమెరికా వెళ్ళాడు.కోడలు ఒక్కత్తే ఇక్కడ బెంగలూరూలో ఉంటోండి. మరి నీ పరిస్తితి ఏంటి? పెళ్ళి అయ్యాక అమ్మయి నీకూడానే వస్తుందా .. లేక?”

“వెంటనే కాదండీ. తనది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమే. రామగుండం NTPCలో చేస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగంగా, వదులుకోలేం. నేనే చూస్తున్నా కనీసం దగ్గర్లో అన్నా మారటానికి.”

“సరిపోయింది…. ఈ మాయదారి తిప్పలు మీ అందరికి తప్పలేదన్నమాట. ఎందుకొచ్చిన చదువులు, ఏం పెట్టే ఉద్యొగాలు.నాలుగు స్తంభాలాటలాగ ఈ తిరుగుడుతొనే పోయింది.”

పోనీ నువ్వు కూర్చోపెట్టి పోషించు. ఒక చోటే కూర్చొని తింటాం అనే మాట నొటిదాక వచ్చింది. ఎందుకులే అని నవ్వి ఊరకున్నా. నేను ఊరుకున్నా తాతయ్య ఊరుకోలేదు.

“నలుగురు కలిసి ఉండే ఇలా నాలుగు రోజులుకూడా హడావుడిగానే అయిపోతాయి. ఇహ internet  పెళ్ళిళ్ళు చెసుకుంటే సరి. ఎలాగో internetలోనే సంబంధాలు వెతుక్కుంటున్నారు.పెళ్ళిళ్ళూ కాపురాలూ కూడ అక్కడే చేసేస్తే సరి” అని వెటకరించారు.

తాతగారు కలియుగ వీరబ్రహ్మంలాగా తోచారు ఒక్క క్షణం నాకు. నిజంగానే ఇంకో పదేళ్ళు పోతే అదే పరిపాటి అవుతుందేమో అనిపించింది.

మీరు ఎక్కడుంటారు తాతగారు?” అని అడిగా,నేనూ ఎదో ఒకటి అడగాలని .

“ఆవిడ పైన ఉంటుంది.నేను ఇంకా కిందే ఉన్నా” అని అన్నారు.

‘ఆ ?!?’ అని నేను వెర్రి మొహం వేసా.

“ఆవిడ పోయి మూడేళ్ళు అయ్యింది. మేము కూడ long distance కాపురమే”  అని తెలిసిన ఒక మాట అని పగలబడి నవ్వటం మొదలెట్టారు. ఆయన joke అనుకున్నా,నాకు అది తిత్తినట్టే అనిపించింది.

“మరి మీరెప్పుడు వెళ్తున్నారు” అని పొరపాటున నోరు జారేసాను.

అంత నవ్వునుంచి ఒక్కసారి మొహం చిట్లించి, “ఎక్కడికీ?” అని గంభీరంగా అడిగారు. నన్ను కొట్టటం ఒక్కటే తక్కువ.

“అదే మీ అబ్బాయి దగ్గరికి” అని తడబడ్డాను.

“వాడికి వాడి పెళ్ళాన్ని తీసుకెళ్ళటానికే దిక్కులేదు.ఇంక నన్ను ఎక్కడికి తీస్కెళ్తాడు” అని వాళ్ళ అబ్బాయిని తిట్టారు ఊపులో. ఎందుకొచ్చిందిలే అని ఇక నేను మౌనం వహించాను. ఆ తరువాతి పావుగంటా పరధ్యానంగా ఇద్దరం రైలు కిటికీ లోంచి బయటకి చూస్తూనే ఉన్నాం.

మీకు ఇలా నచ్చిందా? తలా ఒకచోట ఉండటం? ఏం పొదుంతున్నారయ్యా ఈ generation వాళ్ళు ఇలా దూరాలు ఉండి? personal space, వల్లకాడు అని చెప్పి మధ్యలో ఉద్యొగాల పేరిట గోడలు కట్టుకుని తప్పించుకోవటమే కాని, మీరు అనుకునే ఆ spaceలో మీరే ఇరుక్కుని ఉండటం మీకు నచ్చిందా? “అని ఈసారి seriousగానే అడిగారు.

మరి అందరికి ఒకేచోట అన్నీ కుదరాలి అంటే ఈ కాలంలో కష్టమే కదండీ.” అని practicalగా మట్లాడటానికి మొదలెట్టా.

వద్దు,చెప్పొద్దు అని అన్నట్టు తలకాయి అడ్డంగా తిప్పుతూ, చెయ్యి ఎత్తి ఆపుతూ వినకుండా వెంటనే ఆపేసారు.

“తల్లికి బిడ్డ దూరం, భార్యకు భర్త దూరం, ముసలివాళ్ళకు అందరూ దూరం. ఇదే ఇందాక మీ బామ్మగారు ఫొన్లో అన్న కుంటుంబం… కుంటుబడిన కలియుగ కుటుంబం. మీ generationవాళ్ళ priorities వేరు,కారణాలు వేరు.ఎంతైనా మేము బ్రతికిన మంచి బ్రతుకులు మీకు రావు,అర్థంకావు. ఇందాక నువ్వు అడిగావే,మీరు ఎప్పుడు వెళ్తారు పైకి అని.. మా నుంచి మీరు మీ నుంచి మేము ఎప్పుడోనే దూరంబడ్డాం, భౌతికంగా వెళ్ళటం ఒక్కటే మిగిలింది.” అంటూ కృష్ణసారం ఉపోద్ఘటించి  బండి దిగిపోయారు

 

PS: అయినవారికి అవసరమైన సమయంలో అక్కరకురాక దూరంగా మిగిలిపోయిన దౌర్భాగ్యులకు ఇది అంకితం.

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s