సంఘం క్లిక్కుం గచ్ఛామి !

ప్రసాద్ గాడి ఇంటి డాబా మీద కాఫి తాగుతూ, ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల వెనుకగా అస్తమిస్తున్న సుర్యుడిని చూస్తూ సేదతీరుతున్నా. కింద వాడి ఇంటి గేటు ముందు ఉన్న 1980 కాలం నాటి నా లంబ్రెట్టా స్కూటర్ దగ్గర ఎవరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకడు చటుక్కున జేబులోంచి ఫోన్ తీసి ‘ఆ రెడీ’ అన్నాడు. ఇంకోడు స్కూటర్ ఎక్కి ‘ఊ’ అన్నాడూ. నవ్వుకుంటు ఆ తీసిన ఫోటో చూస్కుంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు.

ఎప్పుడైనా సాయంత్రంవేళ పిచ్చాపాటి,కష్టసుఖాలు మట్లాడుకోవటానికి నా స్నేహితుడు ప్రసాద్ ఇంటికి వెళ్ళటం నాకు నాలుగు దశాబ్దాలనుంచీ అలవాటు. ప్రసాద్ లాంటి సన్నిహితుడు ఒకడుంటే గుండె ఎప్పటికీ భారమెక్కదు.

“అయిపొయిందిరా,ఇక ఖాళీనే..చెప్పు ఎలా ఉన్నావ్,ఏంటి విశేషాలు? చాలా రోజులకి కానీ దొరకలేదు నువ్వు మళ్ళి “ అంటూ ప్రసాద్ కూడా నా వెంట చేరాడు డాబా పైన.

“ఇంకో రెండునెల్లేగా. రిటైరయ్యాక ఇక రోజూ దొరుకుతాలే వద్దన్నా !” అంటూ మా సంధ్యాకాలక్షేపం మొదలుపెట్టాం.

“పిల్లలు ఎలా ఉన్నార్రా?” 

“పెద్దవాడు బానే ఉన్నాడు. వాడూ కోడలు ఎదో కుదురుకున్నారు. చిన్నవాడే అర్థంకావటల్లేదు. కొత్తగా ఇంకేదో చెస్తా అంటున్నాడు.” 

“చెత్తగా చేస్తే కష్టం కానీ, కొత్తగా చెస్తే నష్టం ఏముందిలే. ఇంతకి ఎం చెస్తాట్టా ?!”

“ఏదో event photographyట. అది చేస్తాట్ట తిరిగొచ్చి. అంత డబ్బూ పోసి, ఇంత కాలం చదివీ,తీరా అయ్యాక ఉద్యొగం చెయ్యను, ఈ ఫోటోల బిజినెస్ పెట్టుకుంటా అంటున్నాడు. ఏం తోచట్లేదు ఏం చెప్పాలో వాడికి. మనకెందుకురా ఈ బిజినెస్లు, సుబ్బరంగా వచ్చిన ఉద్యొగం చేస్కోమ్మంటె వింటల్లేదు. అదేమంటె ఇప్పుడు ఇదే పెద్ద మార్కెట్,ఇదే వాడి పాషన్ అని కొత్త మాటలు చెబుతున్నాడు. ఇంకో వెరేదేదైనా  ఆలోచించేవాడిని, కానీ ఈ ఫోటోల బిజినెస్లో ఏమని వస్తుంది,ఎంతకాలమని వస్తుంది చెప్పు. గట్టిగా చెప్దాం అంటే చిన్నవాడూ కాదు, సర్లే అని ఊర్కుందామని అంటే మనసు కుదురుగ ఉండటమూ లేదు. ఎంటో ఇప్పుడు ఈ కొత్త గోలా.”

“ఊ .. మగపిల్లలు వాళ్ళ సంగతి వాళ్ళే చూస్కుంటార్లేరా! ఇబ్బంది లేదు. కానీ..చెయ్యనీ.., ఓ నాలుగు  రోజులు చూసి వాడే మారతాడ్లే మళ్ళి. వాడు చెప్పిందీ ఒకింత నిజమే.ఇప్పుడు తుమ్మినా దగ్గినా ఫోటోలు తీయించుకుంటున్నారు. పెళ్ళికి రెండు లక్షలు ఇవ్వనిదే ఎవడూ  తీయట్లేదు ఫోటోలు.”  అని సముదాయించాడు ప్రసాద్.

ఏదిఏమైనా,ఎంత మగపిల్లవాడైనా,ఈ ఫోటోలు తీసే పిచ్చి నాకేం నచలేదు. కాని చేసేదేంలేక ఈ ఫోటోల తంతు గమనించటం మొదలుపెట్టాను.మరు లక్ష్మీవారం నాడు మా జెనెరల్ మెనేజర్ మనవడిపెళ్ళికి వెళ్ళాం.అంగరంగ వైభవంగా చేసారు. మండపం ప్రాంగణంలో ఒక రెండు బొమ్మ విమానాల్లాంటివి ఎగురుతున్నాయి. ఎవో పిల్లలకోసం సరదా వీక్షణం అనుకున్నా. తీరా చూస్తే తెలిసింది,ఏమిటో గాలి కెమేరాలుట. పైనుంచి పక్షి కోణంలో వీడియొ తీసే ‘డ్రోన్ ‘ అట. Battery అయిపోయి మధ్యలో మాడు మీద పడుతుందేమో అని ఒకింత భయం పుట్టింది.మండపంలో పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసారు. వచ్చేవారిని వచ్చినట్టు ఫోటోలు తీసి,ముఖ్యులైన బంధువులవి, పెళ్ళివారివి, చుట్టాలవి రకరకాల భంగిమల్లో ఫోటోలు వేస్తున్నారు. ఇంకాస్త ముందు ఆ అవతలికి ‘ఫోటో’బూత్ పెట్టారు. పెళ్ళికని సోగ్గా ముస్తాబయ్యి వచ్చినవాళ్ళకి ఒక గుడిలాంటి సెట్ వేసి, అందులో ‘సాంప్రదాయా’ ఫోటోలుట.దానికోసం వచ్చినవారికి టోకెన్ల వారిగా వంతులు పిలుస్తున్నారు. ఆ టోకెన్ల కోసం ఎగబడే వాళ్ళందరూ ఎలాంటి ముష్ఠి యుద్ధంలో అయినా రాణించగలరనటంలో సందోహంలేదు. ఏదో వేసాకాలంలో ఎగ్జిబిషన్ కి వచ్చినట్టే ఉంది. ఈ ఫోటోల విడ్డూరాలనుంచి తేరుకుని అసలు వచ్చింది పెళ్ళికి అనే సంగతి నెమ్మదిగ ఒక అరగంటకి గానీ తెలివికి రాలేదు . పెళ్ళికొడుకు,కూతురుని దీవిద్దాం అని ఆ జనసందోహంలోంచి నెమ్మదిగా మండపంలోకి వచ్చి చూశాం. ఒక అరడజను పైగా కుర్రాళ్ళు,రకరకాలైన కెమేరాలతో వధూవరులిద్దరూ కనపడకుండా ముందు తెరలాగ అడ్డు నుంచున్నారు. ఏ వేళ్టికి అడ్డు తొలగరే. ఎదురుగుండా ఉన్న వధువరులని కూడా పక్కన ఉన్న ఇంకో తెర మీద చూడాల్సి వస్తోంది. ఓర్ని! అనుకుని ఆ స్టేజి పక్కన నుంచున్నాం,పైకి వెళ్ళి దీవించటానికి. నెమ్మదిగా ఆ లైన్లో కదులుతూ మా వంతువచ్చింది. పైకి ఎక్కి దీవిద్దాం అని దగ్గరికెళ్ళేలోపు..

“సార్ ! ఇటు..ఇలాగ !! “ అని ఒక్క అరపు అరిచాడు ఎవడో.

ఏదన్నా తొక్కానేమో అని గుండెదడతో ఒక్క క్షణం జడుసుకుని బేలగా చూశా. నా అయోమయ స్థితి చూశి, ఇంకోతను వచ్చి నన్నూ మా ఆవిడని భుజాలుపట్టుకుని చెరోచోట బిగించాడు. నివ్వెరపోయి చూస్తున్నంతలోపే, రెడీ స్మైల్ ..! అని ఇంకో అరుపు.చెప్పిందే తడవగా ఒక అరనవ్వు యథాలాపంగా నవ్వానో లేదో, కళ్ళు బైర్లుకమ్మేలా ఒక డజను కెమేరా ఫ్లాష్లు పటపటమని మెరిసాయి. ఓకే! అని అనగానే సరే అని తలకాయి ఊపుతూ వచ్చినపనేంటో మర్చిపోయి కిందకి దిగేశాం. దిగిన అరక్షణానికి తట్టింది అయ్యో అసలు దీవించలేదని.

“అసలు పని అవ్వనేలేదు. మళ్ళీ వెళ్దామా ?” అని అడిగా మా ఆవిడ భువనని.

“ఇప్పుడు మన దీవెనలు లేకపో తే వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు.మనం వచ్చినట్టు ఆ ఫోటోల్లో చూస్కుంటార్లేండి పర్లేదు. కాళ్ళు ఇప్పటికే పీకుతున్నాయి “ అని నిక్కచ్చిగా తేల్చెసింది భువన.

నా చేతిలో ఉన్న అక్షింతల్ని ఏం చెయ్యాలో తెలీక నేను పడుతున్న అసహనాన్ని గమనించి, నా చేతిలోని అక్షింతలు నెమ్మదిగా తీస్కోని, తన చెయ్యిని కొంగుచాటుగా కిందకి పెట్టి అక్కడే జారవిడచేసింది. సరే ఇక భోంచేద్దామని పక్కన భోజనాలు పెడుతున్న గార్డెన్ వైపు నడక సాగించాం. అంతలో నా జూనియర్ సాగర్ తారసపడ్డాడు “సార్! నమస్తే “అని పలకరిస్తూ.

“సాగర్, చాలా యేళ్ళే అయ్యిందయ్యా నిన్ను చూసి !” అని పలకరించా.

“అవును సార్. ఈ మధ్యే transfer మీద మళ్ళీ ఈ ఊరొచ్చా. ఇదుగో వీడే మా వాడు. ఏరా ..నన్నూ అంకుల్ని ఒక ఫోటో తియ్యరా నీ ఫోన్లో “ అని వాళ్ళబ్బాయికి పురమాయించాడు. వాడు జేబులోంచి ఫోన్ తీసి మాతో పాటు నుంచుని “సెల్ఫీ తీస్కుందాం డాడీ ” అని ఒక చేత్తో ఫోన్ ని దూరంగా పట్టుకుని రెండో చెయ్యిని ‘బాత్రూంకి వస్తోంది’ అన్నట్టూ చెప్పే రెండు వేళ్ళ సంగ్న్య నా మోహానికి అడ్డోచ్చేలా పెట్టి ఏదో క్లిక్కుమనిపించాడు. ఆ వెంటనే ఇంకెవరితోనో ఫోటో తీస్కొటానికి వెళ్ళీపోయారు తండ్రికొడుకులిద్దరూ.

“ఈ తీస్కున్న ఫోటోలన్ని నిజంగా చూస్కుంటారంటావ అందరూ” అని అడిగా భువనని.

“చూస్కోవటానికి కాకపోతే మరెందుకు తీస్కుంటారు ఎవరన్నా !” అని అంటూ, సందర్భోచితంగా తన చిన్నకొడుకుని కూడా ముందస్తుగానే వెనకేసుకొచ్చింది.

భోజనాల దగ్గర తెరలమీద ఏవరివో డాన్సుల వీడియోలు వేస్తున్నారు.ఆ వీడియోలని తదేకంగా చూస్తున్న నన్ను అక్కడే సాగర్ కలిశాడు మళ్ళి.

“సారీ సార్, ఇందాక ‘సాంప్రదాయ ‘ ఫోటో కోసం మా టోకెన్ వస్తేనూ వెళ్ళాల్సొచ్చింది. ఏమిటీ అంత దీర్ఘంగా చూస్తున్నారు ఆ డాన్సుల్నీ” అని అడిగాడు.

“అదే, వీళ్ళని ఎక్క్ ..” అని నేను మొదలెట్టగానే భువన కొంగుచాటుగా మోచేత్తో ఒక్క పోటు పొడిచింది. నేను ఠపీమని ఆపేశా.

“భోజానలు అయ్యాయా మీవి ? “ అని మాట మార్చేస్తూ అడిగింది భువన వాళ్ళని.

“లేదు ఇదిగో అక్కడికే వెళ్తున్నామండీ.మళ్ళి కలుస్తా సార్.” అని నిష్క్రమించాడు సాగర్. వాళ్ళు అలా వెళ్ళారో లేదో,వెంటనే భువన అందుకుంది…

“అన్నీ అయోమయం మాటలు మీరు.. ఆ డాన్స్ వీడియోలో పెళ్ళికూతురూ,పెళ్ళికొడుకునీ పట్టుకుని ఎక్కడో చూసినట్టుంది అందామని కాకపోతే?” అని కళ్ళు చిన్నగా ఉరిమింది.

“ఏంటీ, వాళ్ళు వీళ్ళేనా ?!? పెళ్ళికొడుకు కారు నలుపుకదే, ఇక్కడేంటి ఇంత పాలుగారే రంగులో ఉన్నాడు ?!” అని తత్తరబడ్డా.

“ఉన్నది ఉన్నట్టు చూపించుకునేట్టైతే ఇంత డబ్బుపోసి ఎందుకు తీయించుకుంటారు ఫోటోలు. ఫోటోషాప్ చేసుంటారు అందంగా కనపడాలని.” అని జాబు చెప్పింది.

“ఫోటోషాపా ! ఇదెక్కడ తెలిసింది నీకు?” నా ప్రశ్న మారింది.

“చిన్నవాడు చెప్పాడు. అవన్ని చెయ్యటానికే ఇప్పుడు బోలెడు ఖర్చు అవుతుందిట.అందుకే ఇప్పుడు అందరూ ఫోటోల మీద లక్షలు పోస్తున్నారుట !” అని వక్కాడించింది.నేను మిన్నకుండిపోయా.

భోజనం చెయ్యటానికి అప్పుడే ఒక కుర్ర ఫోటోగ్రాఫర్ వచ్చాడు. విషయం తెలుసుకుందాం అని నేను మొదలుపెట్టా..

“ఎమయ్యా, ఈ పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతే మరి ఖాళియేనా? !”

“లేదండీ. అసలు తీరిక ఎప్పటికోగానీ దొరకదు. ఎప్పుడు హడావుడే.”

“అంత హడావుడి ఎముంటుంది ఫోటోల బిజినెస్ కి ?” అని ఆరా తీసా.

“పెళ్ళి కాకపోతే వేరేది  సార్ . నిస్చితార్ధం అనో , మొదటి పుట్టినరోజనో, ప్రెగ్నంట్ ఫోటోషూటో, వెడ్డింగ్ టీజర్లో, మమ్మీ డాడీ ఫామిలీ ప్రోమోసో , ప్రపోసల్ ఫోటోషూటో, బీచ్ థీం అనో ,పెట్ షూట్ అనో.. ఈ కాలంలో ఏం చేసినా ఫోటో ఉండాల్సిందే. సోగ్గా తయ్యారయ్యి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని రిక్షా లాగుతునట్టో, గడ్డి పీకుతున్నట్టో, పాతకాలం స్కూటర్లు, సైకిళ్ళూ,ఆటోలూ తోలుతునట్టో… ఏదో ఒకరకంగా ఫోటోలు ఫాషన్ సార్ ఇప్పుడు. గొప్పింటి వాళ్ళకైతే మరీనూ..బాగా తయ్యారయ్యి కూలిలూ,మేస్త్రిలు చేసే పనుల పోసులతో ఫోటోలే ఇప్పుడు trend .అలా తీసిన ఒక పదివేల ఫోటోల్లో, మంచివి చూసి ఒక రెండు వేలు ఏరి ..వీటన్నిటినీ ఎడిట్ చేసి, ప్రింట్ చేసి, బైండ్ చేసి ఇవ్వటానికే ఆర్నెల్లుపైగా పడుతుంది ఒక్కో గిరాకీకి. ఇంక టైం ఏది !”  అని ముగించాడు.

ఇదంతా ఇలా చెప్పాడోలేదో, అప్పుడే వధూవరులిద్దారు ఆ భోజనాలు పెట్టే గార్డెన్ కి వచ్చారు.బెల్లం చుట్టూ  ఈగల్లాగ ఆ అరడజను ఫోటోగ్రాఫర్లు కూడా చుట్టూ మూగారు. పెళ్ళికొడుకు ఒక కండువాని జోలేలా పట్టుకుని మొకాళ్ళమీద నుంచుని ముద్దు అడుక్కుంటునట్టూ, ఎదురుగుండ పెళ్ళికూతురు కుడిచెయ్యి నడుం మీద పెట్టుకుని యెడం చేత్తో ‘ఛీ  .. అవతలకి పో ! ‘ అని విదిలించుకుంటునట్టూ ఆ భంగిమ పెట్టారో లేదో, ఒక్క డజను క్లిక్కులు పటపటమన్నాయి. ఆ తర్వాత అలాంటి బిచ్చగాడి భంగిమల్లోనే ఇంకొ పది ఫోటోలు దిగారు. ఇదంతా జాతరలో పులివేషాలు చూస్తున్నంత ఆహ్లాదంగా ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.

ఇలా చిన్ననుంచి పెద్దదాక, ఎవరికితోచిన భంగిమల్లో వాళ్ళు తమతమ ఫోన్లలో ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఇంటికి చేరుకున్నా ఏదో అలజడి. బాత్రూంలోకి వెళ్ళి లైట్ వేసినా ఎవరో నన్ను బాత్రూంలో ఫోటో తీసేసారు అనే సంశయం . రాత్రి నిద్రలో కూడా తటిల్లతలు,మెరుపులూ కలలో విజ్రుంభించి ఉలిక్కిపడి లేచాను. అది ఇందాక పెళ్ళిలో కెమేరా ఫ్లాషుల మహిమ అని తేరుకుని అవతలగదిలోకి వెళ్ళా.

ఎదురుగా అరలో ఉన్న మా ఫోటో ఆల్బంలు కనపడ్డాయి.అందులో మా పిల్లల చిన్నప్పటి ఫోటోలు, మా పెళ్ళివి కొన్ని, ప్రతీ యేటా మేము తిరుపతి వెళ్ళినప్పటివి ఇలా ఎన్నో స్మౄతులు. అవన్నీ చూస్తూ ఇన్నాళ్ళు మేము గడిపిన మా జీవన గమనాన్ని ఆ ఫోటోలద్వారా గ్నప్తికి  తెచ్చుకుంటూ మనసు కొంచెం కుదుటపడింది. అప్పటి కెమేరాలు రీళ్ళు కాబట్టి, కేవలం ముఖ్యమైన ఫోటోలే ఉన్నాయి. ప్రతీ ఫోటో ఒక తీయటి గ్నాపకమే. ఉన్న కొన్ని ఫోటోలని ఒక్కోటి చూస్తూ,గ్నాపకాలని ఆనందిస్తూ రెండు గంటల పైనే గడిపా. ఇప్పటిలా ఇన్ని ఫోటోలు తీసే లభ్యం ఉండిఉంటే, ఇక మనం గ్నాపకం ఉంచుకుని స్ఫురించుకునే ఆనందం లేనట్టే అనుకుని, ఇంత సౌలభ్యం, వెర్రి లేనందుకు ఆనందపడుతూ నిద్రకి ఉపక్రమించా.

అతి సర్వత్ర వర్జయేత్ !

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s