తాయారమ్మ .. బంగారయ్య …

నా పొడవుకాళ్ళ వేగాన్ని అటు ఇటుగా అందుకుంటూ నా వెనకాలే ప్రదక్షిణ చేస్తున్నాడు నా ఏడేళ్ళ కొడుకు బన్నీ. సాయంత్రం వేళ గుడి ప్రశాంతంగా ఉంది. తక్కువమంది జనం- పెద్ద ప్రాంగణం,రావి చెట్టు గాలి, అప్పుడప్పుడు వినిపించే గంట. నిజంగానే స్వఛ్చమైన ప్రశాంతత. నెమ్మదిగా రెండో ప్రదక్షిణకొచ్చాం.

“నాన్నా …!! ” అని కేకేశాడు బన్నీ. వెనక్కి తిరిగి చూశా.

“ఎందుకు 3 times తిరగాలి?” అని అడుగుతూ నా నడకని అందుకున్నాడు. హ్మ్, ఎందుకూ ! అని నేను కూడా ఆలోచిస్తూ ” To respect god.” అని నాకు తెలియకపోయినా ఎదో చెప్పా. నాకు మా నాన్న అదే చెప్పటం గుర్తు.

” అంటే ..? “ అడిగాడు మళ్ళి.

“one time కన్నా, 3 times చెస్తే respect ఇచ్చినట్టు” అని నా తింగర సమాధానంతో వాడి బుర్రని చెడగొట్టేశా. వాడికి నా సమాధానం అర్థంకాకపొయిన, నాకు ఏం రాదని మాత్రం అక్కడితో స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళమ్మైతే ఏం సమాధనం చెప్పేదో అని ఆలోచించా. అసలు వీడి వయసుకి ఈ ఆలోచన ఎందుకొచ్చిందో అనుకుని ఊర్కున్నా.గుడిలో దండం పెట్టుకున్నాక, వాడిని ఎత్తుకున్నా. వాడికి గంట కొట్టటం అంటే మహా సరదా. ఆ పెద్ద గంటని వాడి బలమంతా ఉపయోగించి కొట్టాడనిపించాడు ఒకసారి.

“ఇంకోసారి కొడతావా . ?” అని అడిగా.

“ఎందుకు ? respect కొసమా ? “ అని అమాయకంగా అడిగాడు. ఒక్కసారి టెంకజల్లు కొట్టినట్టైంది నాకు. నిజంగానే నా తప్పుడు సమాధానంతో వాడి ఆలోచనని తప్పుదోవ పట్టించానని సిగ్గేసింది. నా మెడచుట్టూ చెతులేసి పట్టుకుని కొంచం సేపు ఇందాకంతా వాడి చూపుకందని గోపురాన్ని చూశాడు.

“చాలు, నేను నడుస్తా ఇంక  “ అని దిగి, నా చితికిన వేలు పట్టుకున్నాడు. వీడిని చూసిన పూలబడ్డీ వాడు, బయటకి రాగనే ముద్దుచేస్తూ అడిగాడు..

“ఏం పేరు బాబు నీది ? “ అని.

” మను ధన్విన్  “  అని ‘ధా’ వత్తు మొత్తం పలుకుతూ చెప్పాడు పూర్తిగా. అందరం బన్నీ అని పిలిచినా, వాడు మాత్రం ఎప్పుడు ఎవరడిగినా వాడి నిజం పేరే చెప్తాడు. బహుశా వాడికి అదే ఇష్టం కాబోలు. విష్ణు మూర్తి నామాలలో ఒకటైన ‘మనుః’,   శ్రీ రాముడి పేరైన ‘ధన్వినే’ ని కలిపి వాడి బామ్మ తాతాగరు ఎంతో ఇష్టంగా పెట్టీన పేరు కూడా అది.

“ఏం class? “ అని పూలబడ్డి వాడు పొడిగించాడు.

” రెండొవ తరగతి “ అని అచ్చ తెలుగులో చెప్పాడు. ఇన్ని వేలు పొసి english medium లో పెట్టి, second language కింద spanish పెట్టి,అసలు తెలుగు అనేది పాఠ్యాంశంలోనే లేకుండా చేసినా వీడికి ఇంత తెలుగు ఎక్కడినుంచి వస్తోంది అని ఆశ్చర్య పోయాను, అసహనం కూడా చెందాను.నేను డబ్బుకి కక్కూర్తి పడి పిల్లవాడిని government school కి పంపిస్తున్నానేమో అని పూలబడ్డి వాడు నన్ను పైనుంచి కిందదాక ఎగాదిగా చూశాడు. ఇందాక గుడిలో కొడుకు దగ్గర శుంఠగా, ఇప్పుడు పూలవాడి దగ్గర పిశినారివాడిలా ఈ రోజు చెరగని ముద్రవేయించుకున్నా అని వేరు చెప్పక్కర్లేదు.

అటునుంచి వాడి బామ్మ తాతగారింటికి వెళ్ళాం పరిపాటిగా. ముందర పూల కుండీలకు నీళ్ళు పోస్తూన్న మా నాన్నగారు మా రాకని చూసి అన్నారు..

“ఏరా బుడుగా వచ్చావా, పోస్తావా నువ్వు నీళ్ళు “ అని నీళ్ళగొట్టం ఇవ్వబోయారు.

“ఆహా వద్దు. ఇప్పురు కాదు.” అంటూ ఆ గొట్టాన్ని ఒక్క నెట్టు నెట్టి లోపలకి పరిగెత్తాడు “బామ్మా…” అని అరుచుకుంటు.

సంధ్యా దీపం పెట్టి పూజ చేస్కుంటున్న మా అమ్మ వీడి కేక వినగానే హారతికి ఇంకో రెండు కర్పూరాలని జోడించింది. వాడు దగ్గరికి వెళ్ళగానే యెడం చేతిలోని గంట వాడికి అందించి వాడిని దగ్గరికి తీస్కుంది. వాడు కూడా వాళ్ళ బామ్మకి యెడంవైపు మీద ఆనుకుని కూర్చుని ఇంక ఆ హారతి అయ్యేదాక గంట వాయిస్తునే ఉన్నాడు. అంతా అయ్యాక బామ్మా మనవళ్ళిద్దరూ కూడా వసారాలోకొచ్చారు.

“సుహాసిని ఏది?” అని మా అమ్మ ప్రశ్నకి.. “అమ్మకి 3 days నుంచి బాలేదు బామ్మ” అని వాడు జవాబు చెప్పాడు. వెంటనే వాళ్ళ తాతని అడిగాడు..

“తాతారూ… గుడిలో ఎందుకు 3 times తిరగాలి ?” అని.

“హాహా.. ప్రసాదం పెడతారని..” అని నాలానే బోడి జవాబు చెప్పి నవ్వారు.

“కాదు,, నిజంగా ..!” అని ఆయన సమాధానాన్ని తిరస్కరించాడు.

” ఏ నీకు పెట్టలేదా..?” అని మళ్ళీ ఆయన నవ్వటం మొదలెట్టారు. వాడి ప్రశ్నకి సరిగా జవాబు చెప్పలేని మా అసమర్థతకి మొహం చాటేసా నేను. వాడు అడగటంలో ఉన్న seriousness ఆయనకి చెప్పటంలో లేదని వాడే గ్రహించి ‘హ్మ్’ అని ఊరుకున్నాడూ. ఇంతలో మొన్న లేపాక్షి ఎగ్జిబిషన్లో  వాడికోసం కొన్న వైకుంఠపాళి తెచ్చి ఇచ్చారు మా నాన్నగారు.వాళ్ళు ఎక్కడికెళ్ళినా వీడిని ద్రుష్టిలో పెట్టుకుని ఎదన్నా కొంటమో తేవటమో చెయ్యటమో చేస్తుంటారు ఎప్పుడూ. ఇక తాతామనవళ్ళిద్దరు ఆ వైకుంఠపాళి ఆడుకుంటూ ఆ వేళ గడిపారు. కావాలని ఓడిపోతూ, గళ్ళలోని బొమ్మలన్నీ వివరిస్తూ వాడిని గెలిపించి మురిసిపోయారు ఆయన. అవ్వగానే వాడి బామ్మ వాడికి అన్నం గోరుముద్దలు తినిపించి,మాకు కూడ కూరా పప్పు ఇచ్చి ఇంటికి పంపింది.

మర్నాడు బన్నీకి విపరీతమైన జ్వరం చేసింది. మందులేసినా తగ్గకపోయేసరికి ఇంక వాడిని ఆస్పత్రిలో చేర్చాం. సుహాసినికి వాడిని అలా చూసి కాలూ చెయ్యి ఆడలేదు. తను కూడా దిగాలుపడి నీరుగారిపోయింది.విషయం తెలిసి మా అమ్మానాన్నగారు కూడా ఆస్పత్రికి వచ్చారు. పెద్దవాళ్ళైనా నిబ్బరంగా మాకే ఎదురు తోడుగా వచ్చారు. మనవడిని అలా మంచం మీద చూసి, అక్కడే పక్కనే కుర్చిలాక్కుని స్థిరపడింది మా అమ్మ. ఒక చెయ్యి మంచం మీద వాడికి ఆనించి పెట్టి రెండొ చేత్తో పుస్తకం పట్టుకుని గజేంద్ర మోక్షం, సుందరకాండ, విష్ణు సహస్రనామం ఏకాగ్రతతో చదవటం మొదలెట్టింది. బన్నీకి ఆ స్లోకాలు ఏం అర్థమవ్తున్నాయో తెలియదు కాని, ఆ పారాయణం అంతా వింటూ వాళ్ళమ్మని బామ్మనీ నీరసంగా చూస్తూనే ఉన్నాడు. ఇది చూసి డాక్టర్కి కూడా ఆయన వైద్యం కన్నా మా అమ్మ భక్తి మీదే నమ్మకం కుదిరింది.  మా నాన్న మాత్రం ఆస్పత్రిలో ముందర వైటింగ్ రూంలో టీవీ రిమోట్ ఎవ్వరికీ ఇవ్వకుండ ఆయనకి కావాల్సిన న్యూస్ ఛానెల్స్ పెట్టుకుని అదే తన జీవిత కర్తవ్యంలా ఆపకుండా చూస్తూనే ఉన్నారు. ఆ రిసెప్షనిస్ట్ నాకు సైగ చేసింది కాస్త ఆయన్నీ బయటకి తీస్కెళ్ళమని.

“పోని మీరు ఇంటికెళ్ళండిలేండి నాన్న. ఇక్కడ ఎంతసేపని ఉంటారు. అమ్మని నేను దింపుతా” అని అడిగా.

” ఇంటికెళ్ళి నేనేం చేస్తారా? నువ్వే మీ ఆవిడని తీస్కోని వెళ్ళు. మళ్ళి రేపు మీరిద్దరు ఆఫీసులకి వెళ్ళాలి. నేనూ అమ్మా ఉంటాంలే ఇక్కడే వాడికి నయం అయ్యేదాక.” అని ఎదురు నాకే చెప్పారు. మళ్ళి కొంచంసేపు ఆగి ఆయనే బయటకి వెళ్ళారు. ఆయన టీ తాగి, మా అందరికి ఫలహారం తెచ్చారు. గుడికి కూడా వెళ్ళినట్టున్నారు కాబోలు, బన్నీకి విభూథి కూడా తెచ్చి పెట్టారు.

మందుల మహిమో మా అమ్మ మంత్రాల మహత్యమో గాని, ఆ సాయంత్రంవేళకల్లా జ్వరం జారింది. ఇంత బాగా చూస్కునే బామ్మ తాతలుంటే మీ వాడికేం ఢొకాలేదంటూ,ఇంక అవసరంలేదని డాక్టర్ వాడిని డిస్చార్జి చేసారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు వచ్చి మాతోనే ఉండీ పత్యం అదీ చూసి, వాళ్ళకి ధైర్యం కుదిరాకే వెళ్ళారు. ఇంత అవ్యాజమైన ప్రేమతో ప్రతీ పనికీ తయ్యారయ్యే తాయరమ్మలాంటి బామ్మా, అన్నిటికీ కాచుకుని ఉండే బంగారంలాంటి తాత వాడికి ఉన్నందుకు నాకు కొండంత బలంలా అనిపించింది.

 *****************

Advertisements

2 thoughts on “తాయారమ్మ .. బంగారయ్య …

  1. అనుపమ బ్లాగులో ఉన్న కామెంట్ చూసి మీ బ్లాగుకి వచ్చాను. చాలా పోస్ట్స్ చదివాను. మీ రైటింగ్ స్టైల్ కి చదివించే గుణం ఉంది 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s